తెలంగాణలో తలపడడానికి స్థాపించిన పార్టీని నట్టేట వొదిలేసి, తమతో కలిసిపోయిన షర్మిలను ఏపీ ఎన్నికల్లో పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించి మరీ మోహరించడం వెనుక కాంగ్రెసు పార్టీ బహుశా చాలా చాలా ఆశలు పెట్టుకుని ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అక్కడ ఏకంగా సీఎం అయిపోయినప్పుడు, ఆయన కూతురును కీలకంగా బరిలో నిలిపితే.. కనీసం తమ పార్టీకి తిరిగి ప్రాణం పోయకుండా ఉంటుందా? అనే ఆశ వారిది. ఆ ఆశ కేవలం వైఎస్సార్ అభిమానులు జగన్ కు అనుకూలంగా వేయగల ఓటును చీల్చడంలో మాత్రమే కాదు.
ఎమ్మెల్యేలుగా పోటీచేయడానికి సరైన అభ్యర్థుల్ని , ఎట్ లీస్ట్, వైఎస్సార్ కాంగ్రెస్ తిరస్కరించిన వారినైనా ఆకర్షించగలదని.. ఆ విధంగా కొన్ని సీట్లలోనైనా గట్టి అభ్యర్థులను బరిలో ఉంచగలం అని కాంగ్రెస్ తలపోసి ఉంటుంది. అయితే ఆ దిశగా షర్మిల ప్రభావం శూన్యం అని, ఓటర్లను ఆమె ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందో.. ఎన్నికల తర్వాతనే తేలుతుంది గానీ, నాయకులపై ప్రభావం చూపడం అసాధ్యం అని నిరూపణ అవుతోంది. ఆమె ప్రభావం శూన్యం అని తేలుతోంది.
షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్న వార్తలు ఖరారు అయిన వెంటనే.. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, తాను ఆమె వెంట నడవబోతున్నట్టుగా ప్రకటించారు. అప్పటికే.. వైసీపీలో టికెట్ దక్కకుండా అలకపూని రాజీనామా చేసి ఉన్న ఆయన.. షర్మిల కాంగ్రెసులో చేరిన రోజే తాను కూడా చేరుతానని, ఆమె వెంట నడుస్తానని అన్నారు. తీరా, ఆమె పార్టీలో చేరేనాడు కాకపోయినా కొన్నాళ్ల తర్వాత కాంగ్రెసు కండువా కప్పించుకున్నారు.
నెలరోజులు తిరక్కముందే తిరిగి వైసీపీ గూటికి చేరారు. జగన్ ను తిరిగి పొగడడం ప్రారంభించారు. ఆయన ఒక్కడి కథ మాత్రమే కాదు.. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి వైనం కూడా గమనిస్తే.. షర్మిల నాయకులకు నమ్మకం కలిగేలా నాయకత్వం చేయలేకపోతున్నారని తెలిసిపోతుంది.
వైసీపీ టికెట్ నిరాకరించిన తర్వాత.. సీరియస్ గా అలిగిన మరొక నాయకుడు కాపు రామచంద్రారెడ్డి. ఆ వెంటనే ఆయన రఘువీరారెడ్డితో భేటీ కావడం వంటి పరిణామాలు అలాంటి అభిప్రాయాన్ని కలిగించాయి. ఆర్కే, కాపు వంటి వారు వచ్చి చేరితే.. సిటింగ్ ఎమ్మెల్యే స్థాయి వారిని పార్టీలోకి రాబట్టిన ఘనత షర్మిలఖాతాలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా అంతా ఉత్తిదే అని తేలిపోతున్నది.
కాపు రామచంద్రారెడ్డి కూడా తనకు వైసీపీలో ఠికానా లేదని అర్థమైన తర్వాత.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. షర్మిల వెంట కాంగ్రెసులో చేరడం యూజ్ లెస్ అని ఆయన భావిస్తున్నట్టుగా ఉంది. కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ తో ఆయన సపత్నీకంగా సమావేశం కావడం ఆసక్తికరంగానే ఉంది. ఏపీసీసీ సారథిగా షర్మిల నాయకుల మీద ఎలాంటి ప్రభావమూ చూపలేకపోతున్నారని అర్థమవుతోంది.