షర్మిలక్క ఏం సాధించాలనుకుంటున్నారు?

కాలం కలిసి వస్తే ఎంపీగా నెగ్గగలననే పట్టుదలతో కడప బరిలో చాలా కష్టపడి పనిచేసిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మల కేవలం మూడో స్థానానికి మాత్రమే పరిమితం అయ్యారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య…

కాలం కలిసి వస్తే ఎంపీగా నెగ్గగలననే పట్టుదలతో కడప బరిలో చాలా కష్టపడి పనిచేసిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మల కేవలం మూడో స్థానానికి మాత్రమే పరిమితం అయ్యారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేయించింది.. అవినాష్ రెడ్డే అని షర్మిల, ఆమె సోదరి సునీత ఇద్దరూ ఇల్లిల్లూ తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కడప నియోజకవర్గ ప్రజలు వారిని నమ్మలేదు.

అవినాష్ రెడ్డి మీద తమ అచంచలమైన నమ్మకాన్ని మళ్లీ చాటి చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలను పీసీసీ చీఫ్ చేయడం ద్వారా.. పార్టీకి పూర్వవైభవం తెచ్చేస్తామని కాంగ్రెస్ భ్రమపడింది గానీ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎప్పుడో నూకలు చెల్లిపోయాయని ప్రజలు నిరూపించారు. అయితే ఏం ఆశిస్తున్నారో గానీ.. వైఎస్ షర్మిల ఇంకా అలవిమాలిన కష్టానికి పూనుకుంటున్నారు. 

వైఎస్ షర్మిల ఈ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి సంబంధించి.. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఒక్కరోజుకు రెండేసి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి.. పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ నాయకులు అందరినీ సమావేశపరచి వారిద్వారా ఓటమి కారణాలు తెలుసుకోవడానికి, పార్టీని పటిష్టం చేయడానికి గల మార్గాలను అన్వేషించడానికి ఆమె ప్రయత్నించబోతున్నారు. అయితే ఇంత కష్టం చేయడం ద్వారా షర్మిల ఏం ఆశిస్తున్నారు? ఆమె ఆశలను తీర్చగల సత్తా, వెసులుబాటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి.

కడప ఎంపీగా పోటీ చేసినంత మాత్రాన షర్మిల గెలుస్తుందనే నమ్మకం ఎవ్వరికీ లేదు. కాకపోతే.. వైఎస్ తనయగా.. జగన్మోహన్ రెడ్డి మీద అదే పనిగా బురద చల్లడం ద్వారా ఆయన ఓటు బ్యాంకును కాస్త చీల్చగలదని కాంగ్రెస్ నమ్మింది. అదే సమయంలో.. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాస్తయినా పెరుగుతుందని ఆశపడ్డారు. కానీ.. అలా జరగలేదు. అలా జరిగి ఉంటే కనీసం షర్మిలకు ఒక రాజ్యసభ పదవిని కట్టబెట్టేవారు.

కానీ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు పెద్దగా సానుకూల ఫలితాలు రాలేదు. దేశంలో పడిపోయిన తమ పార్టీ ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడానికి ఈ ఎన్నికల్లో కనీసం 100 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంటే వారు 99 దగ్గర ఆగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి రాజ్యసభ అవకాశం వస్తే దానిని షర్మిల కోసం త్యాగం చేసే స్థితిలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నదా? అనేది కీలకమైన చర్చ. ఏ ప్రయోజనమూ సాధించే అవకాశమే లేకుండా.. షర్మిల పార్టీ కోసం పడుతున్న కష్టం చూసి పలువురు జాలి వ్యక్తం చేస్తున్నారు.