ఉత్తరాంధ్రాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు అయిదు ఎంపీ సీట్లు ఉంటే ఇందులో మూడు ఎంపీ సీట్లు పది దాకా అసెంబ్లీ సీట్లు పొత్తులో భాగంగా టీడీపీ తన మిత్రులు అయిన బీజేపీ జనసేనలకు కట్టబెట్టాలని చూస్తోందని అంటున్నారు.
ఇప్పటికి విశాఖ జిల్లాలో నాలుగు సీట్లు జనసేనకు కేటాయించారు. బీజేపీకి ఎక్కడ ఇస్తారో చెప్పలేదు. విశాఖ సౌత్, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి జనసేనకు ఇచ్చారు. అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి ఇస్తారని అంటూంటే విశాఖ సీటు కోసం ఆ పార్టీ పట్టుబడుతోంది. విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇస్తే అది ఒక బిగ్ షాక్ తమ్ముళ్లకు అని అంటున్నారు. విశాఖ ఉత్తరం సీటు బీజేపీకి కట్టబెడతారు అని అంటున్నారు. ఆ సీటుని టీడీపీకి చెందిన కీలక నేతలు ఆశిస్తున్నారు.
విజయనగరం ఎంపీ సీటు కూడా బీజేపీకి ఇస్తారు అని మరో ప్రచారం సాగుతోంది. దాంతో ఆ సీటుని ఆశిస్తున్న వారు అంతా ఖంగు తింటున్నారు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల సీటుని జనసేనకు ఇచ్చారు. దాంతో అక్కడ తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. విజయనగరం జిల్లాలో పార్వతీపురం సీటుని జనసేనకు ఇస్తారని కూడా ప్రచారంలో ఉంది. దాంతో ఆ పార్టీలో సీటు ఆశిస్తున్న వారు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం అసెంబ్లీ సీటు బీజేపీకి ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ దంపతులు భారీ షాక్ తినడం ఖాయం అంటున్నారు. ఇదే జిల్లాలో పాలకొండ సీటుని జనసేనకు ఇస్తారని అంటున్నారు.
అదే విధంగా అరకు ఎంపీ సీటుని పాడేరు ఎమ్మెల్యే సీటుని బీజేపీకి ఇస్తారని అంటున్నారు. పాడేరు ఎమ్మెల్యే సీటు మీద మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆశలు పెట్టుకున్నారు. కమలం సీటుని తన్నుకుని పోతే ఆమె వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. అరకు ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వవద్దంటూ అపుడే అధినాయకత్వానికి విన్నపాలు వెళ్తున్నాయి. ఇలా చూసుకుంటే కనుక తమ్ముళ్ళకు మరో రెండు మూడు రోజులలో ఇంకా అసలైన షాకులు ఉన్నాయని అంటున్నారు.