ఈనాడుని చూసి భయపడుతున్న ఎమ్మెల్యేలు..!

ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొదలైంది. ఫలానా చోట ఎమ్మెల్యేని నిలదీసిన మహిళలు, ఫలానా ఎమ్మెల్యేని తరుముతున్న స్థానికులు, ఇంకొకరికి గడపగడపలో ఘోర అవమానం.. ఇలా ఈనాడు బ్యానర్ ఐటమ్ లు…

ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొదలైంది. ఫలానా చోట ఎమ్మెల్యేని నిలదీసిన మహిళలు, ఫలానా ఎమ్మెల్యేని తరుముతున్న స్థానికులు, ఇంకొకరికి గడపగడపలో ఘోర అవమానం.. ఇలా ఈనాడు బ్యానర్ ఐటమ్ లు కట్టి మరీ బ్లాక్ మెయిల్ కి దిగుతోంది. దీంతో ఆయా ఎమ్మెల్యేలు జగన్ దగ్గర తమ పరపతి పోతుందేమోనని టెన్షన్లో ఉన్నారు. 

టెస్ట్ పెట్టాను, అందులో పాసైనవారికే మళ్లీ సీట్లిస్తానంటూ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు జగన్. 'ఈనాడు' చేస్తున్న పనితో ఇలాంటి వారంతా హడలిపోతున్నారు.

అనిల్ స్ట్రాంగ్ వార్నింగ్..

ఇటీవలే మాజీ మంత్రి అనిల్ కుమార్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గతంలో సీఏఏ, ఎన్ఆర్సీ గొడవల సమయంలో అనిల్ కి మైనార్టీ వర్గాల నుంచి కాస్త ఇబ్బంది ఎదురైంది. ఆ పాత వీడియోని తీసుకొచ్చి గడప గడప కార్యక్రమానికి లింకు పెట్టి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో అనిల్ కి చిర్రెత్తుకొచ్చింది. యూట్యూబ్ ఛానెళ్లకు వార్నింగ్ ఇచ్చారు. 

తన అభిమానులు రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇలాంటి కల్పిత వార్తల్లో ఆరితేరింది. అడ్డగించేవారు టీడీపీవారు, అడ్డు చెప్పేవారు ఆ పార్టీ కార్యకర్తలు., అయినా జనం ఎదురు తిరిగారంటూ నిస్సిగ్గుగా రాసేస్తున్నారు. గడప గడప కార్యక్రమంపై బురదజల్లుతున్నారు.

“మా ప్రభుత్వం గత మూడేళ్లలో మీకు ఇంత మేలు చేసింది, గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. తేడా చూడండి, మరోసారి మమ్మల్ని ఆశీర్వదించండి” అంటూ.. వైసీపీ నేతలు ప్రతి ఇంటి తలుపూ తడుతున్నారు. అంటే పరోక్షంగా ఇది టీడీపీకి బాగా మైనస్ అవుతుందనే చెప్పాలి. అందుకే ఈ కార్యక్రమాన్ని టీడీపీ, వారి అనుకూల మీడియా బాగా టార్గెట్ చేసింది. 

ఎక్కడో ఏదో అయిపోతుందనే భ్రమ కలిగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గడప గడపకు కార్యక్రమానికి వస్తున్న విశేష స్పందన చూసి చంద్రబాబు మతిపోయిందని, అందుకే ఆయన తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడుతున్నారు వైసీపీ మంత్రులు.

ఎవరి సమర్థింపులు ఎలా ఉన్నా.. గ్రౌండ్ లెవల్లో కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం హడలిపోతున్నారు. ఏరోజు ఎవరు నిలదీస్తోరో, ఎక్కడ ఎలాంటి సమస్య ఉంటుందోనని, తెల్లారి పేపర్లో ఎలాంటి హెడ్డింగ్ చూడాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంలో పచ్చ మీడియా బాగా బరితెగించేసింది. ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ బ్లాక్ మెయిల్ చేస్తోంది.

మీడియాలో వచ్చే వార్తల్ని పక్కనపెట్టినా.. ఈ కార్యక్రమం ఎమ్మెల్యేలకు, తమ నియోజకవర్గ వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అనుచరులు, సొంత మనుషుల సర్వేలు, సమర్థింపులు కాకుండా.. జనం ఏమనుకుంటున్నారనే విషయం తెలుస్తోంది. 

ఎమ్మెల్యేలకు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలేంటో తెలుస్తాయి. లేదా.. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి సమస్యలను పట్టుకుని రాద్ధాంతం చేయగలవో ఓ అంచనాకి వస్తారు. దీంతో వారు పూర్తి స్థాయిలో ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవచ్చు. నిజంగానే తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవచ్చు.