జ‌గ‌న్ మైండ్‌గేమ్ తెలుసుకోడానికి నాలుగేళ్లు!

సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌మతో ఆడుతున్న మైండ్ గేమ్ తెలుసుకోడానికి బీజేపీకి నాలుగేళ్లు ప‌ట్టింది. ఈ విష‌యాన్ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తెలిపారు. త‌మ‌ను వైఎస్ జ‌గ‌న్ ఎలా బ‌ల‌హీన‌ప‌రిచారో ఆయ‌న…

సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌మతో ఆడుతున్న మైండ్ గేమ్ తెలుసుకోడానికి బీజేపీకి నాలుగేళ్లు ప‌ట్టింది. ఈ విష‌యాన్ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తెలిపారు. త‌మ‌ను వైఎస్ జ‌గ‌న్ ఎలా బ‌ల‌హీన‌ప‌రిచారో ఆయ‌న పూస‌గుచ్చిన‌ట్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌లు సమీపిస్తున్న త‌రుణంలో బీజేపీ మేల్కొంది. బీజేపీ అగ్ర‌నేత‌లు అమిత్ షా, జేపీ న‌డ్డా ఇటీవ‌ల ఏపీలో ప‌ర్య‌టించారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ భారీ అవినీతికి పాల్ప‌డుతున్న‌ట్టు ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. దేశంలో మ‌రెక్క‌డా ఇలాంటి అవినీతి లేద‌ని వాళ్లిద్ద‌రూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇసుక‌, మ‌ట్టి, మైనింగ్ త‌దిత‌ర అక్ర‌మాల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ తెర‌లేపిన‌ట్టు అమిత్ షా, న‌డ్డా ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఒకే ఒక్క వాక్యంతో వారికి కౌంట‌ర్ ఇచ్చారు. త‌న‌కు ఎల్లో మీడియా, ద‌త్త పుత్రుడు, అలాగే బీజేపీ అండ‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌న్నారు.

దీంతో బీజేపీ గింగ‌రాలు తిరుగుతోంది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మీడియా ముందుకొచ్చారు. త‌న‌కు బీజేపీ అండ ఉండ‌క‌పోవ‌చ్చ‌నే కామెంట్‌కు అర్థం ఏంటో చెప్పాల‌ని జ‌గ‌న్‌ను వీర్రాజు డిమాండ్ చేశారు. మీతో బీజేపీ ఎప్పుడు ఉందో చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు.  

త‌న‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌ని జ‌గ‌న్ అన్నార‌ని వీర్రాజు ప్ర‌స్తావించారు. వైఎస్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి రాజ‌కీయ పార్టీ పెట్టారా? అని ప‌వ‌న్‌ను వీర్రాజు వెన‌కేసుకొచ్చారు. మీకెందుకు స‌పోర్ట్ చేస్తార‌ని నిల‌దీశారు. వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎప్పుడూ చెప్ప‌లేదు క‌దా? అని వీర్రాజు ప్ర‌శ్నించారు. త‌న‌కు బీజేపీ అండ‌గా ఉండ‌ద‌ని చెప్ప‌డానికి సీఎం జ‌గ‌న్‌కు హ‌క్కు లేద‌న్నారు.

ఏపీ స‌ర్కార్ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై తాము మొద‌టి నుంచి పోరాటాలు చేస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. అయితే త‌మ విమ‌ర్శ‌ల‌పై ఎప్పుడూ వైఎస్ జ‌గ‌న్ స‌మాధానం చెప్ప‌కుండా ఇంత కాలం మౌనం పాటించార‌న్నారు. మ‌రోవైపు త‌ర‌చూ ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోదీ, కేంద్ర పెద్ద‌ల‌తో స‌మావేశాల‌వుతూ నిధులు తెచ్చుకుంటున్నార‌ని అన్నారు. బీజేపీతో స‌న్నిహిత సంబంధాలున్నాయ‌నే అభిప్రాయాన్ని ఏపీ ప్ర‌జానీకంలో జ‌గ‌న్ క్రియేట్ చేశార‌న్నారు. 

ఇలా అనేక ర‌కాలుగా జ‌గ‌న్ మైండ్‌గేమ్ ఆడుతూ బీజేపీని ప‌లుచ‌న చేశార‌ని వీర్రాజు వాపోయారు. త‌మ విమ‌ర్శ‌ల‌పై వైఎస్ జ‌గ‌న్ ఎందుకు బీజేపీని విమ‌ర్శించ‌ర‌ని వీర్రాజు ప్ర‌శ్నించారు. ఇదంతా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా చేశార‌ని ఆయ‌న అన్నారు. వీర్రాజు ఆవేద‌న చూసి సొంత పార్టీ నేత‌లు సైతం జాలి చూపాల్సి వ‌స్తోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.