ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ముక్కోణపు ప్రేమ సాగుతోంది. ఇది భలే గమ్మత్తుగా వుంది. జనసేనాని పవన్‌కల్యాణ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లవ్ ప్రపోజల్ చేశారు. తనది వన్‌సైడ్ అని చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. చంద్రబాబు ప్రతిపాదనకు పవన్ మనసు కరిగింది. దీంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చంద్రబాబుకు మొహమెత్తింది. జనసేనానిపై ప్రేమ తూచ్ అన్నారు.
‘అదేంటి, నాకంటూ ఒక తోడు ఉన్నా, నువ్వు వెంటపడితేనే కదా, నేను “ఊ” కొట్టింది’ అని పవన్‌కల్యాణ్ భావన. జనసేనాని పవన్‌ను మాత్రం బీజేపీ లవ్ చేస్తోంది. అయితే అటు వైపు నుంచి బీజేపీకి ఆశించిన స్థాయిలో పవన్ నుంచి ప్రేమ దక్కడం లేదు. అదేంటో గానీ, జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన బీజేపీకి ఆంధ్రాలో మాత్రం రాజకీయంగా పరిస్థితి అనుకూలించడం లేదు. ప్రతిరోజూ జనసేనతోనే తమ పొత్తు అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటిస్తూనే వున్నారు.
కానీ పవన్‌కల్యాణ్ నుంచి మాత్రం ఆ ప్రకటనే రావడం లేదు. గత రెండు మూడు రోజులుగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఏం మాట్లాడినా, చివరికి జనసేనతో పొత్తు వరకూ వచ్చి ముగిస్తున్నారు. ఇవాళ కూడా జనసేనతో పొత్తు గురించే సోము వీర్రాజు మాట్లాడ్డం గమనార్హం. సోము వీర్రాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘మా పొత్తు జనం, జనసేనతోనే. కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదు’ అని తేల్చి చెప్పారు.
ఇదే మాట పవన్‌కల్యాణ్‌తో బీజేపీ చెప్పించలేకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది. పవన్ మనసులో ఇతరత్రా ఆలోచనలు వుండడం వల్లే బీజేపీ లైన్ ప్రకారం మాట్లాడలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఏపీలో రాజకీయంగా ఇదో విచిత్రమైన పరిస్థితి అని చెప్పక తప్పదు.