టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, జనసేనాని పవన్‌కల్యాణ్‌లపై మంత్రి జోగి రమేష్ విరుచుకుపడ్డారు. టీడీపీ త్వరలో మూసేసే పార్టీగా ఆయన అభివర్ణించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రోజురోజుకూ టీడీపీ దిగజారిపోతోందని విమర్శించారు. ఏపీలో టీడీపీకి దిక్కులేదని, రేపో-మాపో ఆ పార్టీని మూసేస్తారని వెటకరించారు.
చంద్రబాబు జనం మనసుల్లో విషాన్ని చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు తాను చేసిన మంచి ఏంటో ప్రజలకు చెప్పి ఓట్లు అడగడం లేదన్నారు. ఒక సైకో ప్రవర్తిస్తున్న చందంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రజల ముందు ఓ జోకర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను సీనియర్ అని, మంచి పరిపాలన అందిస్తానని చంద్రబాబు చెప్పిన మాటల్ని నమ్మి, అధికారం అప్పగిస్తే పంగనామాలు పెట్టాడు కదరా అని ప్రజలు అనుకుంటున్నారన్నారు.
86 నియోజక వర్గాల్లో అసలు టీడీపీకి దిక్కే లేదని బాబు సొంత సర్వేలే తేల్చి చెప్పాయన్నారు. మూడున్నరేళ్ల జగన్ పాలనలో 72 ఏళ్లలో జరగని అభివృద్ధిని చూడొచ్చన్నారు. కానీ ప్రజల్ని రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఒక పక్క చంద్రబాబు, మరోపక్క దత్త పుత్రుడు ప్యాకేజ్ పవన్‌కల్యాణ్ ఇద్దరూ కలిసి నువ్వు అది మాట్లాడు, నేను ఇది మాట్లాడుతూ… నువ్వు అక్కడ తిరుగు, నేను ఇక్కడ తిరుగుతా అంటూ కూడబలుక్కుని ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఎన్ని జెండాలు పట్టుకుని వెళ్లినా జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. నువ్విప్పుడు చిక్కిశల్యమై భూస్థాపితమవుతున్న టీడీపీకి అధ్యక్షుడవని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రేపోమాపో మోసుకెళ్లడానికి టీడీపీ సిద్ధమైందన్నారు. చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. ఏం చేశారని చంద్రబాబు మళ్లీ ఓటేయాలని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. ఏపీలో టీడీపీ దిక్కులేదన్నారు. రేపో మాపో ఆ పార్టీని మూసేస్తారన్నారు. నారా లోకేశ్ రాజకీయ అజ్ఞానిగా ఆయన అభివర్ణించారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి అయ్యారని విరుచుకుపడ్డారు.