బడ్జెట్ సెషన్ విశాఖకు వెరీ స్పెషల్

ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి మొదలవుతున్నాయి. ఆ రోజున శాసన సభ, శాసనమండలి రెండింటినీ ఉద్దేశించి కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం తరువాత 17న బడ్జెట్ ని…

ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి మొదలవుతున్నాయి. ఆ రోజున శాసన సభ, శాసనమండలి రెండింటినీ ఉద్దేశించి కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం తరువాత 17న బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెడతారని సమాచారం. ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగం సభకు వివరిస్తూనే విశాఖ గురించి కీలకమైన ప్రస్థావన చేసే అవకాశం ఉంది అంటున్నారు.

విశాఖకు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ అవుతుంది అని కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి మరింతగా ఊతమిచ్చేలా బడ్జెట్ సమావేశాల్లోనే ప్రస్తావన ఉండవచ్చు అంటున్నారు. ఈసారి ఉగాది మార్చి 22న వచ్చింది. అప్పటికి సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖకు షిఫ్ట్ అయ్యే పనులు కీలక దశకు చేరుకుంటాయని అంటున్నారు.

ఇప్పటికే విశాఖలో చూస్తే అనేక ప్రభుత్వ భవనాలను స్వాధీనంలో చేసుకుని వాటికి నగిషీలు దిద్దుతున్నారు. కొన్ని పాత భవనాలు ఖాళీగా ఉన్న వాటిని సైతం పునరుద్ధరిస్తున్నారు. విశాఖ సిటీ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ లో అతి పెద్ద ప్రభుత్వ భవనం ఒకటి ఉంది.

ఆ భవనానికి సరికొత్త హంగులు దిద్దుతున్నారు. విశాఖకు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ వస్తే ప్రభుత్వ యాక్టివిటీ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. అందువల్ల ఈ సువిశాల భవనాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు అని తెలుస్తోంది. ఇదే తీరున మరికొన్ని భవనాలను కూడా జిల్లా అధికారులు గుర్తించి వాటిని సైతం సమాయత్తం చేస్తున్నారు.

బడ్జెట్ సమావేశాలు ఈసారి ప్రత్యేకంగా చూడాలని అంటున్నారు పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎన్నికల వరాలు సంక్షేమ పధకాలతో పాటు ఈసారి విశాఖ గురించి కూడా బడ్జెట్ లో అతి ముఖ్య సమాచారం శాసన సభ వేదికగా ఉండొచ్చని అంటున్నారు. అందువల్ల ఈసారి బడ్జెట్ సెషన్ విశాఖ వాసులకు వెరీ స్పెషల్ అన్న మాట వినిపిస్తోంది.