టీడీపీలో మాజీ ఎమ్మెల్యేల చేరిక‌…కొంత కాలానికే దూరం!

తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీలో ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతోంది. మాజీ ఎమ్మెల్యేలు మునిరామ‌య్య‌, ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరడం, ఆ పార్టీకి దూరం కావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో…

తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీలో ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతోంది. మాజీ ఎమ్మెల్యేలు మునిరామ‌య్య‌, ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరడం, ఆ పార్టీకి దూరం కావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు అనుకున్న‌దొక‌టి, అయ్యిందొక‌టి అనే చందంగా త‌యారైంది.

ప్ర‌స్తుతం శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీ ఇన్‌చార్జ్‌గా బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ఉన్నారు. సుధీర్ తండ్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని నాయ‌కుడిగా ఆధిప‌త్యం చెలాయించారు. అయితే ఆయ‌న అనారోగ్యంతో రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. 2019లో టీడీపీ త‌ర‌పున సుధీర్ పోటీ చేసినా విజ‌యం సాధించ‌లేక‌పోయారు. వైసీపీ నేత బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి గెలుపొందారు.

అయితే అధికారాన్ని అడ్డు పెట్టుకుని మ‌ధుసూద‌న్‌రెడ్డి ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇదే సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాల్సిన బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి, ఆ ప‌ని చేయ‌కుండా హైద‌రాబాద్‌కే ప‌రిమితం అయ్యారు. ఒక ద‌శ‌లో ఇలాగైతే టికెట్ ఇవ్వ‌న‌ని బొజ్జ‌ల సుధీర్‌ను చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఆ త‌ర్వాత సుధీర్ శ్రీ‌కాళ‌హ‌స్తికి వెళ్లి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు.

ఇదే సంద‌ర్భంలో వైసీపీలో మాజీ ఎమ్మెల్యేలు మునిరామ‌య్య‌, ఎస్సీవీ నాయుడు అసంతృప్తితో ఉండేవారు. దీంతో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మునిరామ‌య్య‌, ఆయ‌న కుమారుడు ప్ర‌వీణ్ క‌లిసి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ త‌ర్వాత కొంత కాలానికి ఎస్సీవీ నాయుడు కూడా టీడీపీలో చేరారు. వీళ్ల‌ద్ద‌రి చేరిక‌తో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. బొజ్జ‌ల సుధీర్‌పై వ్య‌తిరేక‌త‌తో ఎస్సీవీ నాయుడికి టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది.

ఆ ఆశ‌తోనే ఎస్సీవీ టీడీపీ కండువా క‌ప్పుకున్నార‌న్న‌ది వాస్త‌వం. ఎస్సీవీకి టికెట్ ఇస్తే చేస్తా అని మునిరామ‌య్య కూడా ప్ర‌క‌టించారు. అంతిమంగా టీడీపీ జెండా ఎగురేస్తామ‌ని మాజీ ఎమ్మెల్యేలు, బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ప్ర‌క‌టించారు. కానీ చంద్ర‌బాబు శ్రీ‌కాళ‌హ‌స్తి ప‌ర్య‌ట‌న‌లో త‌మ‌ను అస‌లు ప‌ట్టించుకోలేద‌ని మాజీ ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం జ‌రిగాయి. ఇప్పుడా దూరం మ‌రింత పెరిగి, పార్టీ కార్య‌క‌లాపాల్లో అస‌లు పాల్గొన‌డం లేదు.  దీంతో టీడీపీకి ఊపిరి ఆడ‌ని ప‌రిస్థితి. 

అస‌లే శ్రీ‌కాళ‌హ‌స్తిలో టీడీపీ ప‌రిస్థితి అంతంత మాత్రంగా వుంది. మాజీ ఎమ్మెల్యేల రాక‌తో ఆశ‌లు చిగురించి, మ‌ళ్లీ వాడిపోయాయి. దీంతో శ్రీ‌కాళ‌హ‌స్తిని ఇక మ‌రిచిపోవాల్సిందే అని టీడీపీ శ్రేణులు నిరాశ‌తో అంటున్నాయి.