రాజధాని అమరావతిని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ రేంజ్‌లో వాడుకుంటున్నాడు. అలాగే రాజధాని పేరుతో ఆ సెంట్‌మెంట్ గురించి తానే మాట్లాడుతున్నట్టుగా పిక్చర్ క్రియేట్ చేసి తనకిష్టం వచ్చినట్టు ఆయన ఆడుకుంటున్నాడు. అమరావతి ఉద్యమ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి కనీసం ఒక రోజు కూడా గడవకనే మళ్లీ కొత్త అవతారం ఎత్తడం వెనుక కొలికపూడి మాస్టర్ ప్లాన్ ఉందని అమరావతి అనుకూలవాదులు అనుమానిస్తున్నారు.
అమరావతిలో మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేస్తూ, పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని ఆయన నిరసిస్తూ ఆమరణదీక్షకు పిలుపునిచ్చారు. మాప్టర్ ప్లాన్‌లో ఎలక్ట్రానిక్ సిటీ కోసం, పారిశ్రామిక సంస్థల స్థాపన కోసం , లక్షలాది ఉద్యోగాల కల్పన కోసం కేటాయించబడ్డ ప్రాంతాన్ని రాజకీయ లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానానికి నిరసనగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అబ్బురాజుపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్షకు సిద్ధమైనట్టు ఆయన ప్రకటించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే… రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేయడం అవసరమని భావించిన వారు తనతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేయడం.
ప్రత్యేకంగా ఎవరినీ ఆయన ఆహ్వానించలేదని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఆ పని ఆయన చేయడు కూడా. ఎందుకంటే అమరావతి ఉద్యమకారులెవరూ ఆయన్ను నమ్మరు. ఊసరవెల్లికి ఎక్కువ, పొద్దుతిరుగుడు పువ్వుకు తక్కువ అనే రీతిలో కొలికపూడి రోజుకో రంగు మారుస్తుంటారని అమరావతి ఉద్యమకారుల అభిప్రాయం. ఇదే కొలికపూడి మంగళవారం తన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు ఏంటో చూద్దాం.
“అమరావతి ఉద్యమం రైతుల నాయకత్వంలో నడిచినన్ని రోజులు ప్రభుత్వాన్ని భయపెట్టింది. రియల్ ఎస్టేట్ దళారులు ఉద్యమ నాయకులైన తర్వాత …ఉద్యమం చచ్చిపోయి ప్రభుత్వమే రైతుల్ని భయపెట్టింది. ప్రస్తుతం ప్రతి పార్టీ ఓట్లను లెక్కేసుకుంటోంది. రాజధానికి భూములిచ్చిన రైతులను బలి ఇస్తోంది”
అమరావతి ఉద్యమంలో రియల్ ఎస్టేట్ దళారులు ప్రవేశించారని తానే చెబుతూ, ఇప్పుడు ఎవరి కోసం, ఎందుకోసం ఆమరణ దీక్ష చేస్తున్నట్టు? నిజంగా అమరావతిపై ప్రేమే వుంటే, ముందు రాజధాని భూముల్లో నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులను, దళారులను తరిమే కొట్టే పనికి కొలికపూడి దిగాలి. రాజధాని ప్రాంతంలో భూమి అంతా పరిశ్రమలకే కేటాయించారని, పేదలెందుకని కొలికపూడి ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పరిశ్రమలను స్థాపించడానికి ప్రత్యేకంగా పారిశ్రామిక జోన్లు, సెజ్‌లు ఉన్నాయి. రాజధాని పేరుతో పారిశ్రామిక వాడను స్థాపించడాన్ని సమర్థిస్తారా? నిన్న ఒక మాట, ఆచరణకు వచ్చే సరికి మరొకటి. ఇంతకూ అమరావతికి శత్రువులెవరు? మిత్రులెవరు? అనే అనుమానాన్ని ఇలాంటి వాళ్లను చూస్తే కలుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే ఆమరణ దీక్ష ఎత్తుగడ వేశారని, ఆయన్ను పట్టించుకునే వాళ్లెవరూ లేరని అమరావతి ఉద్యమ నాయకులు అంటున్నారు. నటనలో బ్రహ్మానందాన్ని మించిపోయాడని, ఆయనకు ఎల్లో మీడియా ఎక్కువ ప్రచారం చేయడం వల్లే ఉద్యమానికి ఏకు మేకయ్యాడనే ఆవేదన వారిలో కనిపిస్తోంది.