ఏడు కొండలపై కొలువైన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని ఆదాయం అమాంతం పెరిగింది. ఈ నెలలో గత 21 రోజుల్లో రూ.100 కోట్ల ఆదాయం దాటింది. ఇదో రికార్డుగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల తిరుమలకు భక్తుల సంఖ్య పెరిగింది. రోజువారీ ఆదాయం గతంలో కంటే అధిగమిస్తోంది. ఒక్క రోజులో స్వామి ఆదాయం రూ.5 కోట్లను అధిగమించడం విశేషం.
కరోనా తగ్గుముఖం పట్టడం, సామాన్య భక్తులను కూడా తిరుమలకు అనుమతించడంతో ఆదాయం పెరిగింది. శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు వడ్డీకాసుల వాడికి ఏదో ఒకటి సమర్పించకుండా వెళ్లడం లేదు. వేసవి సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తజనంతో కిటకిటలాడుతోంది. నిత్యం కొండ రద్దీగా వుంటోంది.
కాలి నడకన తిరుమలకు చేరుకునే వాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. అలిపిరిలో భక్తుల తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీకి అర్ధగంట సమయం పడుతోంది. స్వామి దర్శనానికి 10 లేదా 12 గంటల సమయం తీసుకుంటోంది.
స్వామివారి దర్శనానికి అనేక వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమలకు వెళుతున్నారు. స్వామి దర్శనంతో తాము పడ్డ శ్రమను భక్తులు మరిచిపోతున్నారు. స్వామి దర్శనమే మహాభాగ్యమని తలస్తున్నారు. స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటూ ఆదాయాన్ని కూడా పెంచుతున్నారు.