ఏపీలో రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన పొత్తుల్లోకి భారతీయ జనతాపార్టీ కూడా వచ్చి చేరుతుందా లేదా అనే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ తనంత తాను చంద్రబాబు పల్లకీ మోయడానికి, ఆయనను సీఎం చేయడానికి పాటుపడాలని డిసైడైపోయారు. అయితే ఆయన వేసిన స్కెచ్ ను ఫాలో అయిపోతూ.. మోడీ దళం కూడా చంద్రబాబు పల్లకీ మోయడానికి అత్యుత్సాహం చూపిస్తారా లేదా? అనే క్లారిటీ లేదు.
పొత్తులు దాదాపుగా ఉండవచ్చు అనే సంకేతాలు ఇచ్చే లాగానే.. ఏపీ భాజపాకు సారథ్యం వహిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి కూడా వివిధ సందర్భాల్లో మాటలు వదులుతూ వచ్చారు. మొత్తానికి పొత్తులపై రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని అధిష్ఠానానికి పంపేశారు. తీరా ఇప్పుడు కాషాయదళంలో చంద్రబాబునాయుడు కోవర్టు అనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండే సుజనా చౌదరి చిలకపలుకులు పలుకుతున్నారు.
గతంలో ఎన్డీయే నుంచి తెలుగుదేశం వెళ్లిపోయిందని, ఇప్పుడు మళ్లీ కలవాలని అనుకుంటే గనుక రెండు పార్టీల ప్రయోజనాల కంటె.. రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని ఆయన సెలవిస్తున్నారు. రాష్ట్రానికి ప్రజలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావిస్తే మాత్రమే బిజెపి నాయకత్వం పొత్తులకు ఒప్పుకుంటుందట.
ఇంతకంటె ఆత్మవంచనతో కూడిన మాట మరొకటి ఉంటుందని అనుకోలేం. ఎందుకంటే.. బిజెపి ఈసారి తమ పార్టీకే 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోందని, ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయాలనే దిశగా ఆ కోణంలోంచే నిర్ణయం తీసుకుంటారని కూడా ఆయనే అంటున్నారు. అదే నిజమైతే తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుంటే ఏపీలో ఒకటో రెండు సీట్లు బిజెపికి దక్కుతాయనేది ఆయన మాటల అంతరార్థం.
జగన్మోహన్ రెడ్డి ఎటొచ్చీ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకునే సమస్యేలేదు. సొంతంగా రాష్ట్రంలో పోటీచేసి ఒక్క సీటునైనా దక్కించుకోవడం కాదు కదా.. కనీసం ఒక్క సీటులోనైనా డిపాజిట్ తెచ్చుకోగల తెగువ ఆ పార్టీకి లేదు. సో, ఖచ్చితంగా పొత్తులు పెట్టుకోవాలనే కోరికనే రాష్ట్ర పార్టీ అధిష్ఠానానికి నివేదించి ఉంటుంది.
పొత్తులు పెట్టుకోవడం జరిగితే గనుక.. అది ఖచ్చితంగా బిజెపికి వేరే గతిలేక ఒప్పుకోవడమే. కాకపోతే.. రాష్ట్రానికి, ప్రజలకు ప్రయోజనం అయితే మాత్రమే పొత్తులు పెట్టుకుంటాం అంటూ సుజనా చిలకపలుకులు పలుకుతున్నారు. పొత్తుల ద్వారా తాము రాష్ట్రం నుంచి లోక్ సభ కు ఎంపీలు కావొచ్చునని సుజనా వంటి తెదేపా కోవర్టులు కమలదళంలో ఆశపడుతున్నట్టుగా కనిపిస్తోంది.