బీజేపీ సీనియర్ నాయకుడు, టీడీపీ శ్రేయోభిలాషి సుజనాచౌదరి మళ్లీ పాత పాటే అందుకున్నారు. పాడిందే పాడరా పాచిపళ్ల దాసరి అనే చందాన చౌదరి మాటలున్నాయి. రాజధాని మార్పు అనగానే సుజనాచౌదరి పూనకం వచ్చినట్టుగా ఊగిపోతుంటారు.
గతంలో అమరావతి రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ ఆగడాలను ప్రధాని మోదీ చూస్తున్నారని అన్నారు. తగిన సమయంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి, రాజధాని ఎక్కడా కదలకుండా అడ్డుకుంటుందని ప్రగల్భాలు పలికారు.
ఆ తర్వాత మూడు రాజధానుల బిల్లులపై విచారణలో భాగంగా ఇదే కేంద్ర ప్రభుత్వం రెండు దఫాలు సమర్పించిన అఫిడవిట్లలో కీలక విషయాలు పేర్కొంది. రాజధాని ఎంపిక, ఏర్పాటు అనేవి పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశాలను స్పష్టం చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొంది. బహుశా ఈ విషయాలేవీ జనానికి తెలియదని సుజనా చౌదరి అనుకున్నట్టున్నారు.
తాజాగా అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో మరోసారి రాజధాని అంశం తెరపైకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి తన మార్క్ హెచ్చరికలు చేయడం గమనార్హం. అమరావతిపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అమరావతే ఆంధ్రుల రాజధానిగా వుంటుందని స్పష్టం చేశారు. రాజధానులు నిర్మించడం వైసీపీకి చేతకాదన్నారు. రైతుల పాదయాత్రకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఒకవైపు రాజధాని రైతుల పోరాటానికి మద్దతు అంటూ, మరోవైపు న్యాయస్థానానికి మాత్రం అందుకు విరుద్ధంగా అఫిడవిట్లు సమర్పించడం బీజేపీకే సాధ్యమైంది. ఒక్కో బీజేపీ నేత ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. రాయలసీమ బీజేపీ నేతలు మాత్రం కర్నూలులో హైకోర్టు, సుప్రీంకోర్టు బెంచ్, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఇలా అనేక అంశాలుతో కర్నూలు డిక్లరేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి ఆ పార్టీ నాయకుల విధానాలే కారణమని చెప్పొచ్చు.