స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ పొందిన చంద్రబాబునాయుడికి సుప్రీంకోర్టులో విచారణ మరో పది రోజులకు వాయిదా పడింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో పాటు ఎలాంటి షరతులు లేవని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రాజకీయ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నప్పటికీ, స్కిల్ కేసు గురించి మాత్రం నోరు విప్పకూడదు. స్కిల్ స్కామ్ కేసు గురించి చంద్రబాబుతో పాటు ఇరు వర్గాలు బహిరంగంగా మాట్లాడకూడదని ధర్మాసనం ఆదేశించడం గమనార్హం.
ఈ నెల 20న చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకట్రెండు రోజుల్లో పుణ్యక్షేత్రాల సందర్శనకు చంద్రబాబు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారానికి పలువురు దేవుళ్ల ఆశీస్సులు తీసుకున్న తర్వాతే వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న తిరుమల, అనంతరం విజయవాడ కనదుర్గమ్మ అమ్మవారిని సందర్శించేలా ఆయన షెడ్యూల్ను ఖరారు చేశారు.
ఆలయాల సందర్శన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ను వచ్చే నెల 8కి వాయిదా వేయడం గమనార్హం. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చిన తర్వాతే వాదనలు వినాలన్న ఆలోచనతో ధర్మాసనం వుండడం విశేషం.