ఏపీలో వైసీపీ పాలన మీద జనాలు విసుగెత్తిపోయారని పొలిట్ బ్యూరో మెంబర్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిగజపతిరాజు చెప్పుకొచ్చారు. ఏపీలో వచ్చేది నూరు శాతం టీడీపీ ప్రభుత్వమే అని ఆయన అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవ వేడుకలు ఈ రోజు అంతటా జరుగుతున్నాయి. తెలుగుదేశం 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశోక్ టీడీపీ గొప్పదనం గురించి మాట్లాడారు.
వైసీపీ కాదు కదా ఎవరైనా టీడీపీని తీసిపారేయాలనుకుంటే అది కుదిరేది కాదని అశోక్ అంటున్నారు. టీడీపీని లేకుండా చేయాలనుకునే వారే కొట్టుకుపోయారని అశోక్ చెప్పడం విశేషం. చట్టాన్ని చుట్టాలుగా టీడీపీ ఏనాడూ మార్చుకోలేదని అశోక్ అంటున్నారు.
తెలుగుదేశం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పెంచిందని అన్నారు. నేర పూరిత రాజకీయాలు టీడీపీ చేయలేదని అశోక్ పేర్కొన్నారు. ఎన్టీయార్ టీడీపీ ద్వారా తెలుగు జాతి కీర్తిని ఇనుమడింపచేశారని కొనియాడారు. టీడీపీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిందని అశోక్ అంటున్నారు.
ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని జనాలు గెలిపించారు కాబట్టి ఇక వైసీపీకి పరాజయమే అని తమ్ముళ్ళు పాడిన పాటనే సీనియర్ పొలిటీషియన్ అశోక్ కూడా చెప్పడం విశేషం. అంటే వైసీపీ ఓటమి ఖాయమని, టీడీపీకి జనాలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అశోక్ జోస్యం చెప్పారన్న మాట.
ఏపీలో అన్ని ప్రాంతాలను టీడీపీ సమానంగా చూసిందని చెబుతున్న అశోక్ 2019లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందో విశ్లేషించి చెప్పగలరా అంటున్నారు. ఒకే పార్టీ కలకాలం అధికారంలో ఉండాలనుకోవడం మంచి విధానం కాదు అన్న అశోక్ మాటలు ప్రస్తావించ తగినవే. అదే తెలుగుదేశం పార్టీ 2029, 2050 అంటూ విజన్ ప్రకటించడం వెనక కూడా ఏపీలో పూర్తిగా తామే ఉండాలన్న ఆకాంక్ష అశోక్ కి కనబడలేదా అని అడుగుతున్నారు.
ఎన్టీయార్ గొప్పవారు, తెలుగు జాతికి కీర్తి పతాక నిలువెత్తు సంతకం అని గొప్పగా చెబుతున్న టీడీపీ పెద్దలు ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారో చెప్పాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఎండమావిలో ఒయాసిస్సులా పట్టభద్రుల సీట్లలో విజయం దక్కితే దానికి తమ్ముళ్ళు పొంగుతున్నారు. వెటరన్ పొలిటీషియన్ అశోక్ కూడా అదే నిజమని టీడీపీయే వస్తుందని భావించడమే కాస్తా అతిగా ఉందని కూడా అంటున్నారు.