ముసుగేసుకుని యుద్ధం చేస్తున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీది ఫార్టీ ఇయర్స్ హిస్టరీ. ఎన్నికలు అంటే భయం లేదు అని చెప్పే పార్టీ.  కానీ శ్రీకాకుళం జిల్లా లోకల్ బాడీ కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ పోటీకే…

తెలుగుదేశం పార్టీది ఫార్టీ ఇయర్స్ హిస్టరీ. ఎన్నికలు అంటే భయం లేదు అని చెప్పే పార్టీ.  కానీ శ్రీకాకుళం జిల్లా లోకల్ బాడీ కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ పోటీకే దిగలేదు. నూటికి తొంబై శాతం లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు వైసీపీకి ఉన్నారు. విజయం ఆ పార్టీదే. దాంతో పోటీ పడినా పరువు పోవడం తప్ప ఒరిగేది ఉండదు.

ఈ సంగతి తెలిసి టీడీపీ అసలు పోటీ పెట్టలేదు. అలాగని ఏకగ్రీవంగా వైసీపీకే ఈ సీటు సమర్పించుకుందా అంటే అక్కడ టీడీపీ మార్క్ పాలిటిక్స్ ని చూపించింది అంటున్నారు. బూర్జ మాజీ జెడ్పీటీసీ ఆనెపు రామకృష్ణ అనే ఆయన ఇండిపెండెంట్ గా నామినేష్ వేశారు. ఇలా నామినేషన్ వేసి అలా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.

ఆయన్ని పోటీ నుంచి విత్ డ్రా చేసేందుకు వైసీపీ నుంచి ప్రయత్నాలు జరిగినా కూడా అవి బెడిసికొట్టాయి. దాంతో మార్చి 13న ఎన్నిక అనివార్యం అయింది. అధికార పార్టీకి ఇంతలా షాక్ ఇచ్చిన ఆ ఇండిపెండెంట్ వెనకాల టీడీపీ ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. పోటీ పడితే డైరెక్ట్ గా రావాలి కానీ ఈ ముసుగులో గుద్దులాట ఏంటి తమ్ముళ్ళూ అని సెటైర్లు వేస్తున్నారు.

ఈ ఇండిపెండెంట్ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో సామాజిక సమీకరణలను కూడా ఎగదోసి వైసీపీ ఓట్లను క్రాస్ చేయించాలని తెర వెనుక టీడీపీ బృహత్ ప్రయత్నమే చేస్తోంది అంటున్నారు. వైసీపీ ఎలాగైనా గెలిచే సీటు ఇది. దాంతో నూటికి నూరు శాతం ఓట్లు వైసీపీ ఖాతాలో పడాల్సిందే అని వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు.

ఎవరు క్రాస్ చేసినా తెలిసిపోతుందని, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికైనా వెనకాడమని ఆయన స్పష్టం చేస్తున్నరు. మంత్రి లెవెల్ లో ఈ వార్నింగ్ ఇవ్వడం. అది కూడా ఒక ఇండిపెండెంట్ విషయంలో ఇంత గాభరా పడాలా అంటే అక్కడ వెనక ఉన్నది తెలుగుదేశమని అందుకే వైసీపీ సైతం అలెర్ట్ అయింది అంటున్నారు. అయినా ఇంత ప్రతిష్ట కలిగిన టీడీపీ ఆఖరుకు ఒక ఇండిపెండెంట్ ని దింపి రాజకీయం చేయడమేంటి. ఇదేనా 2024 లో అధికారంలోకి వచ్చేస్తున్నామని ఇస్తున్న భారీ ప్రకటనలకు అర్ధమని వైసీపీ నేతలు అంటున్నారు.

అయితే తమ పార్టీకి ఈ ఎన్నికలతో సంబంధం లేదని టీడీపీ వారు చెబుతున్నా ఒక మాజీ జెడ్పీటీసీకి అధికార పార్టీని ఎదిరించి నిలువరించి గెలుస్తానన్న నమ్మకం కలగడం అంటే వెనక కొండంత అండగా పసుపు పార్టీ లేకపోతే ఎలా సాధ్యమని వైసీపీ వారు అంటున్నారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఇపుడు ఉత్కంఠను రేపుతోంది.