చంద్రబాబునాయుడు కంటే ఆయన కుమారుడు నారా లోకేశ్ టీడీపీ శ్రేణులకు తెగ నచ్చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం… జనసేన, బీజేపీతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో సీఎంగా చంద్రబాబునాయుడు వుంటారనే సంకేతాలు లోకేశ్ ఇవ్వడమే. పొత్తులో భాగంగా సీట్లు, నియోజకవర్గాల గురించి చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ మధ్య చర్చల వివరాలు ఇంత వరకూ వెల్లడి కాలేదు.
ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు ఖరారవుతున్న నేపథ్యంలో… వాటి పంచాయితీ ఎప్పుడు తేలుతుందో క్లారిటీ లేదు. ఈ క్రమంలో సీట్లు, నియోజకవర్గాల గురించి లోకేశ్ ఏమీ మాట్లాడ్డం లేదు. కానీ చంద్రబాబే సీఎం అవుతారని బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న లోకేశ్ తీరు టీడీపీ శ్రేణులకు బాగా నచ్చుతోంది. నిజానికి అధికారంలోకి రావడానికి తమకు జనసేనతో పొత్తు ఎంతోకొంత ఉపయోగపడుతుందని టీడీపీ నాయకుల నమ్మకం.
అయితే జనసేన నాయకుల ఓవరాక్షన్‌ను టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. చంద్రబాబునాయుడితో పాటు పవన్ కూడా అధికారంలో భాగం పంచుకుంటారని జనసేన నాయకులు, కార్యకర్తలు చెప్పడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకున్నాయి. జనసేనకు అతికి ఫుల్స్టాప్ పెట్టేలా ఆ మధ్య సీఎం పదవిపై లోకేశ్ తేల్చి చెప్పారు. చంద్రబాబే పూర్తి కాలం సీఎంగా వుంటారని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
సీఎం పీఠంపై లోకేశ్ కామెంట్స్ గురించి ఇటీవల పవన్‌కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. లోకేశ్ కామెంట్స్ జనసేనలో మంట పుట్టించాయన్నది వాస్తవం. కానీ లోకేశ్ సీఎం కుర్చీపై చేసిన కామెంట్స్‌ను టీడీపీ ఖండించలేదు. తాజాగా జనసేనకు మరోసారి కోపం తెప్పించేలా లోకేశ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగిస్తూ… “18 నుంచి 59 సంవత్సరాలున్న మహిళలకు ప్రతి నెలా రూ.1500 చంద్రబాబునాయుడు ఇవ్వబోతున్నారు. అంటే ప్రతి ఏడాది రూ.18 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.90 వేలు చంద్రబాబునాయుడు ఇస్తారు. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా చంద్రబాబునాయుడు కల్పించబోతున్నారు” అని చెప్పుకెళ్లారు.
ఒకవైపు టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని చెబుతూనే, మరోవైపు సీఎంగా చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తారని లోకేశ్ చెప్పడం విశేషం. లోకేశ్‌లోని ఈ ధైర్యం టీడీపీ శ్రేణుల్ని ఆకట్టుకుంటోంది. మరోవైపు చంద్రబాబునాయుడే అన్నీ అందిస్తారని లోకేశ్ చెప్పడం జనసేనకు పుండు మీద కారం చల్లినట్టుగా వుందనే చర్చకు తెరలేచింది.