చంద్రదళం.. కాపీ కొడుతున్నారా? గైడెన్స్ చేస్తున్నారా?

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, తమ ప్రత్యర్థుల మీద బురద చల్లుతూ పుస్తకాలు ప్రచురించడం, పాటలు రాయించడం వంటి వేషాలు తెలుగుదేశం పార్టీకి కొట్టిన పిండి. నిజానికి ఇవాళ్టి రోజుల్లో ప్రతి పార్టీ కూడా…

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, తమ ప్రత్యర్థుల మీద బురద చల్లుతూ పుస్తకాలు ప్రచురించడం, పాటలు రాయించడం వంటి వేషాలు తెలుగుదేశం పార్టీకి కొట్టిన పిండి. నిజానికి ఇవాళ్టి రోజుల్లో ప్రతి పార్టీ కూడా అనుసరిస్తున్న పద్ధతులు ఇవి. కాకపోతే తాజాగా జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన మీద నిందలు వేయడానికి, బురద చల్లడానికి తెలుగుదేశం పార్టీ ప్రచురించిన పుస్తకానికి చార్జిషీట్ అంటూ కొత్త పేరు పెట్టుకుంది. 

ఈ చార్జిషీట్ అనే పదం ద్వారా.. పచ్చదళం.. తాము కమలాన్ని కాపీ కొడుతున్నట్టు చెప్పదలచుకున్నదా? లేదా, తాము ప్రచురించిన చార్జిషీట్ ద్వారా కమలదళానికి స్ఫూర్తి ఇవ్వాలని, గైడెన్స్ చేయాలని తపన పడుతున్నదా అర్థం కావడం లేదు.

తెలుగుదేశం పార్టీ, జగన్ నాలుగేళ్ల పాలన మీద చార్జిషీట్ ప్రచురించింది.  అందులో సహజంగా బోలెడన్ని నిందలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రస్తావించుకోవడం అనవసరం. ఎందుకంటే.. అవి ప్రతి తెదేపా నాయకుడూ ప్రతిరోజూ ప్రతిచోటా చెబుతున్నవే. అలాంటి కాకమ్మ కబుర్లే దీని నిండా ఉన్నాయి.

కాకపోతే భారతీయ జనతా పార్టీ కూడా జగన్ సర్కారు మీద చార్జిషీట్ లు వేసే పనిని ఒక దీర్ఘకాలిక వైద్యం లాగా నిర్వహిస్తూ ఉంది. ఆల్రెడీ ఒక లెవెల్ చార్జిషీట్ వేశారు. దానికి పాపం తెలుగుదేశం చార్జిషీట్ కు వచ్చినంత పాపులారిటీ రాలేదు. ఇంకా జిల్లా స్థాయిలోను, నియోజకవర్గాల స్థాయిలో కూడా జగన్ పాలనపై చార్జిషీట్లు విడివిడిగా వేస్తాం అంటూ వారు హెచ్చరించారు కూడా. అయితే మీలెవెల్లో తిడితేచాలదు. మా లెవెల్లో తిట్టండి అని వారికి సంకేతం ఇస్తున్నట్టుగా చంద్రదళం ఒక అతిపెద్ద ఛార్జిషీట్ ను తయారుచేశారు.

నిజానికి బిజెపి వారిని జగన్ సర్కారుపై చార్జిషీట్లు వేయాల్సిందిగా వారి ప్రధాని నరేంద్రమోడీ సుమారు ఏడాది కిందట పురమాయించారు. చాన్నాళ్లు వారికి ఆ పని చేతకాలేదు. మోడీ ఆదేశాలను తాము ఇంకా గొప్పగా పాటిస్తున్నాం అని సంకేతాలు ఇస్తున్నట్టుగా టీడీపీ చార్జిషీట్ ఉంది. 

మోడీని కూడా ప్రసన్నం చేసుకుని.. పవన్ కల్యాణ్ సహా, కమలనాయకులతో కూడా తన పల్లకీ మోయించుకోవాలని అనుకుంటున్న చంద్రబాబునాయుడు.. చార్జిషీట్ పేరుతో చేస్తున్న ఈ ప్రహసనం కామెడీగానే ఉంది. కాస్త లోతుగా పరిశీలిస్తే.. తెలుగుదేశం వారి అవకతవకలు తప్పుడు పనులు కూడా ఈ చార్జిషీట్ ద్వారా తెలిసిపోయేలా ఉన్నాయి.