ప‌రిశ్ర‌మ‌లొస్తాయంటే త‌ట్టుకోలేక‌!

టీడీపీ బాధ ప‌గ‌వారికి కూడా వ‌ద్దు. ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు రాలేద‌ని విమ‌ర్శించేది ఆ పార్టీ వాళ్లే. వ‌స్తున్నాయంటే వ‌ద్ద‌నేది కూడా వాళ్లే. ఏపీలో ఇదో విచిత్ర ప‌రిస్థితి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీది ఎవ‌రికీ చెప్పుకోలేని…

టీడీపీ బాధ ప‌గ‌వారికి కూడా వ‌ద్దు. ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు రాలేద‌ని విమ‌ర్శించేది ఆ పార్టీ వాళ్లే. వ‌స్తున్నాయంటే వ‌ద్ద‌నేది కూడా వాళ్లే. ఏపీలో ఇదో విచిత్ర ప‌రిస్థితి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీది ఎవ‌రికీ చెప్పుకోలేని బాధ‌. తూర్పుగోదావ‌రి జిల్లాలో బ‌ల్క్‌డ్ర‌గ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక అప్ప‌టి నుంచి టీడీపీ ఓర్వ‌లేక‌పోతోంది.

బ‌ల్క్‌డ్ర‌గ్ పార్క్‌ను ఎలాగైనా అడ్డుకోవాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. అలాగ‌ని చంద్ర‌బాబు, లోకేశ్ నేరుగా రంగంలోకి దిగ‌క పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ప్ర‌జాద‌ర‌ణ కోల్పోయి, క‌బుర్ల‌తో ప‌బ్బం గ‌డుపుతున్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికి అడ్డ‌గింత బాధ్య‌త‌ల్ని అప్ప‌గించారు. ఎందుకంటే ఈయ‌న‌కు జ‌నంతో సంబంధం లేదు కాబ‌ట్టి, ఏం చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని టీడీపీ వ్యూహం. మ‌రోవైపు ప‌రిశ్ర‌మ‌ల రాక‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీ వైఖ‌రిని అధికార పార్టీ వైసీపీ త‌ప్పు ప‌డుతోంది.

పార్మా ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెంది రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌ని టీడీపీ ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్టు వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. కేంద్రానికి య‌న‌మ‌ల రాసిన లేఖ‌లో  …కాకినాడ జిల్లా తొండంగి మండ‌లం కొత్త‌పెరుమాళ్ల‌పురం, కోదాడ గ్రామాల ప‌రిధిలో బ‌ల్క్‌డ్ర‌గ్ పార్క్ ఏర్పాటు చేస్తే తీవ్ర ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌లు తలెత్తుతాయ‌ని హెచ్చ‌రించారు. ఔష‌ధ వ్య‌ర్థాల కార‌ణంగా కోన‌సీమ ప్రాంతంలో జ‌ల‌, భూ, వాయు, స‌ముద్ర కాలుష్యం ఏర్ప‌డుతుంద‌ని , దీనివ‌ల్ల సుమారు 50 వేల మంది స్థానికులు ఉపాధి కోల్పోతార‌ని, వేల ఎక‌రాల భూమి వ్య‌వ‌సాయానికి ప‌నికి రాకుండా పోతుంద‌ని ప్ర‌స్తావించారు.

ఇంత సీరియ‌స్ విష‌యంపై చంద్ర‌బాబు, లోకేశ్ ఎందుకు మాట్లాడ్డం లేద‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. బ‌ల్క్‌డ్ర‌గ్ ప‌రిశ్ర‌మ రాక‌ను అడ్డుకుంటే చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు, లోకేశ్ త‌ప్పించుకుని తిరుగుతున్నార‌ని వారు ఆరోపిస్తున్నారు. అందుకే య‌న‌మ‌ల రామృక‌ష్ణుడిని ముందు పెట్టి, రాష్ట్ర ప్ర‌జానీకంతో ఆడుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు పౌర స‌మాజం నుంచి వ‌స్తున్నాయి. ఏపీకి ప‌రిశ్ర‌మ‌ల రాక‌పై టీడీపీ వైఖ‌రి ఏంటో చెప్పాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.