యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టి నెల రోజులైంది. ఇవాళ్టికి 31వ రోజుకు చేరింది. పాదయాత్రపై టీడీపీ హ్యాపీగా మాత్రం లేదు. లోకేశ్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడతారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. తీరా అడుగు వేస్తే తప్ప, ప్రజల్లో లోకేశ్‌పై ఉన్న అభిప్రాయం ఏంటో తెలియరాలేదు.
ప్రస్తుతం తిరుపతి జిల్లా చంద్రగిరిలో లోకేశ్ పాదయాత్ర సాగుతోంది. ఇవాళ్టికి 400 కి.మీ. పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. పాదయాత్రపై టీడీపీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటోంది. పాదయాత్రకు జనం ఆశించిన స్థాయిలో రాలేదనే విషయంలో టీడీపీ అగ్రనేతలు స్పష్టంగా ఉన్నారు. ఇదే రీతిలో సాగితే టీడీపీకి నష్టమని కూడా వారు భావిస్తున్నారు. దీంతో పాదయాత్రకు రానున్న రోజుల్లో బ్రహ్మరథం పడుతున్నారనే సానుకూల సంకేతాల్ని తీసుకెళ్లేందుకు టీడీపీ సీరియస్‌గా ఆలోచిస్తోంది.
ఇక మీద నెమ్మదిగా పాదయాత్రకు జన సమీకరణ చేయాలనే నిర్ణయానికి టీడీపీ వచ్చింది. మరో మూడు నెలల్లో పాదయాత్రను ఓ రేంజ్‌లో సక్సెస్ చేయాలని నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చారు. అయితే అది ఒక్కసారిగా కాకుండా రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందన్న భావన క్రియేట్ చేసేందుకు టీడీపీ మేధావులు ఆలోచిస్తున్నారు. అప్పటికి ఎన్నికల వాతావరణం మరింత పెరుగుతుందని టీడీపీ ఉద్దేశం.
లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేసుకోవడం అంటే, జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే భావనను సృష్టించడమే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కావున రానున్న రోజుల్లో లోకేశ్ పాదయాత్రలో జనం ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి.