చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద డ్రామా నడుస్తోంది. బాబు అరెస్ట్‌తో టీడీపీకి సానుభూతి వెల్లువెత్తుతుందని ఆ పార్టీ నాయకులు ఆశించారు. అయితే అలాంటి వాతావరణం కనిపించలేదు. ఎప్పట్లాగే జనాలు రోజువారీ జీవితాన్ని సాగిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో బాబు అరెస్ట్ కేంద్రంగా సానుభూతి పొందేందుకు టీడీపీ నానా తిప్పలు పడుతోంది.
ఈ క్రమంలో వీకెండ్స్‌లో బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ, ఆయనకు సంఘీభావంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా బాబును అరెస్ట్ చేయడం అంటే న్యాయానికి సంకెళ్లు వేయడమే అని టీడీపీ భావించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త, నాయకుడు చేతలకు సంకెళ్లు తగిలించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీ నిరసన కార్యక్రమాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అవినీతిలో అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంఘీభావం ఏంటని నిలదీస్తున్నారు. చంద్రబాబు అంటే మానవాతీతుడు కాదని, చట్టాలేవీ ఆయనకు వర్తించవనే విపరీత ధోరణితో వ్యతిరేకత పొందుతున్నారనే అభిప్రాయాలు మరోవైపు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నిరసనలు టీవీలలో కామెడీ స్కిట్లను తలపిస్తున్నాయని ఎద్దేవా చేస్తున్నారు.
లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి, రఘురామకృష్ణంరాజు తదితరుల నిరసనలకు సంబంధించిన ఫొటోలకు ఒక్కో పేరు పెట్టి, నెటిజన్లు చితక్కొడుతున్నారు. లోకేశ్‌కు పిల్లబిత్రి అవతారం, అలాగే ఒక నాయకుడికి కుక్క గొలుసులాగా వుందని, మరికొందరి ఫొటోలకు డాకినీ, మోహినీ అవతారాలంటూ దెప్పి పొడిచారు. పనిలో పనిగా గాంధీ జయంతినాడు దీక్షలో కూచున్న పవన్ ఫొటోకు బుద్ధావతారం అని ముద్దుగా పేరు పెట్టడం విశేషం.
విజిల్స్ ఊదుతూ , పల్లేలు కొడుతూ, దీపాలు ఆర్పుతూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు నాటకాలు ఆడుతున్నారని నెటిజన్లు పోస్టులు పెట్టారు. తాజాగా సంకెళ్లతో నిరసన. టీవీ కామెడీ స్కిట్లను తలపిస్తున్న ఈవెంట్లు..భలేభలే అంటూ సెటైర్స్ విసిరారు. యాడ దొరికిన సంతరా అని జనం విసుక్కునేలా టీడీపీ కార్యక్రమాలున్నాయని నెటిజన్లు చీవాట్లు పెట్టడం చర్చనీయాంశమైంది.
చంద్రబాబుపై కోర్టులో విచారణ జరుగుతోందని, ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని హితవు చెబుతున్నారు. మీరు మీ వేషాలు… ఆపండ్రా బాబు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.