టీడీపీతో పొత్తుపై బీజేపీ ఇప్పుడే తేల్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెల 18వ తేదీ తర్వాతే పొత్తుపై క్లారిటీ వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంత వరకూ బీజేపీ అంతర్గతంగా కీలక సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించడానికి సమయం ముంచుకొస్తోంది.
పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడకపోవడంతో ముఖ్యంగా టీడీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. బీజేపీతో కూడా పొత్తు ఖరారైతే సుమారు 40 అసెంబ్లీ, 7 లేదా 8 లోక్సభ స్థానాలను జనసేనతో కలిపి ఆ పార్టీలకు ఇవ్వాల్సి వుంటుందని టీడీపీ భావిస్తోంది. ఇన్ని సీట్లలో తమ అభ్యర్థులకు సీట్లు ఇవ్వకపోతో పెద్ద సమస్య ఎదురవుతుందని టీడీపీ భయపడుతోంది.
టీడీపీ, జనసేన పార్టీల ఆందోళనల్ని బీజేపీ పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా అనుసరించాల్సిన వ్యూహంపైనే బీజేపీ అగ్రనేతలు దృష్టి సారించారు. ఈ దఫా బీజేపీ ఒంటరిగానే 350 సీట్లు సాధించాలనే పట్టుదలతో వుంది. ఏపీలో బీజేపీకి కనీస బలం కూడా లేకపోవడంతో ఆ రాష్ట్రంపై ఆసక్తి చూపడం లేదు.
బీజేపీ, జనసేన బలమే తమదిగా బీజేపీ భావిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకూ కూడా కాలయాపన చేసే ఆలోచన బీజేపీది. అన్నాళ్లు అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వకపోతే నాయకులు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకుంటుందని టీడీపీ, జనసేన అధినాయకుల భావన.