ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వరుసగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడంతో, ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. 2024లో టీడీపీదే అధికారం అనే ధీమా వారిలో కనిపిస్తోంది. ఇదే సందర్భంలో చంద్రబాబునాయుడిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రధానంగా జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోకుండా ముందుకెళ్లాలని బాబుపై పార్టీ ముఖ్యులు ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఇంత కాలం ప్రజల నాడి తెలియని పరిస్థితిలో పవన్‌తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే వైసీపీపై వ్యతిరేకత, ఇదే సందర్భంలో టీడీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయనే సంకేతాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాలు ఇస్తున్నట్టు ప్రధాన ప్రతిపక్షం విశ్లేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్‌తో పొత్తు పెట్టుకోవద్దని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. చంద్రబాబు నాయకత్వానికి ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తే అవకాశం వుందని, అలాంటప్పుడు జనసేనకు అధికారంలోకి భాగస్వామ్యం ఇచ్చి కొత్త సమస్య సృష్టించుకోవడం దేనికనే అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి.
దీంతో చంద్రబాబు కూడా ఆలోచనలో పడినట్టు సమాచారం. పవన్‌కల్యాణ్‌ను తమకు తాముగా ఆహ్వానించేది లేదని, ఆయనంతకు ఆయనే వస్తే… అప్పుడేం చేయాలో వేచి చూద్దామని చంద్రబాబు సర్దిచెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పవన్‌కల్యాణ్ రాజకీయాలు స్థిరంగా వుండవని, అభిమానంతో ఆదరించిన వాళ్లకే వెన్నుపోటు పొడుస్తున్నారని చంద్రబాబుకు టీడీపీ నేతలు హితబోధ చేస్తున్నట్టు తెలిసింది.
గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో టీడీపీ విజయం సాధించిన సందర్భంలో కూడా కనీసం జనసేనానికి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా చంద్రబాబు ఇష్టపడకపోవడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాలతో ఒక్కసారిగా ఆ పార్టీ మైండ్‌సెట్ మారుతోంది. ప్రజల్లో తమకు ఆదరణ ఉందని, ఇక మిగిలిన పక్షాలతో పనేంటనే ధోరణి టీడీపీ నేతల్లో పెరుగుతోంది. దాని నుంచి పుట్టిందే పవన్ వ్యతిరేకత.
పవన్‌ను కలుపుకోవడం వల్ల ఆ పార్టీని బలోపేతం చేసినట్టవుతుందని, దానివల్ల రాజకీయంగా రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని బాబును టీడీపీ ముఖ్య నేతలు హెచ్చరిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం టీడీపీలో నెలకున్న ఊపు చూస్తే… జనసేనను పట్టించుకునే పరిస్థితి వుండకపోవచ్చు. అయితే పవన్‌కల్యాణే తనకు తానుగా బాబు వద్దకెళ్లి సీట్ల బేరం ఆడితే… వేళ్ల మీద లెక్కపెట్టగలిగేవి ఇచ్చి సరిపెట్టొచ్చు.