విశాఖ వైసీపీకి మోజు అయిన సిటీ. పాలనా రాజధాని చేస్తామని ఆ పార్టీ గత నాలుగున్నరేళ్ళుగా చెప్పుకుంటూ వస్తోంది. జగన్ సీఎం గా ప్రమాణం కూడా విశాఖ వేదికగా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అలాంటి విశాఖ మీద మోజు టీడీపీకి కూడా పెరుగుతోందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.
విజయవాడలో ఉండాల్సిన నాయకులు, నెల్లూరు తదితర జిల్లాల నాయకులు ఒక్కసారిగా విశాఖ మీద దండయాత్ర చేస్తున్నారు. పోలింగ్ ముగిసాక విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లారు. మేమే గెలుస్తున్నామని క్లారిటీగా చెప్పేశారు.
ఇక వరసబెట్టి టీడీపీ నేతలు విశాఖ విడిది చేస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు విశాఖకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. రానున్న రోజులలో మరింతమంది విశాఖ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.
విశాఖ నుంచి చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయాలని కోరుతున్న స్వరాలు టీడీపీలో వినిపిస్తున్నాయి. దాంతో ఏపీలో రాజకీయ రాజధానిగా ముద్రపడిన విజయవాడను దాటి విశాఖకు రాజకీయం షిఫ్ట్ అవుతోందా అన్న డిబేట్ అంతటా సాగుతోంది. విశాఖ మెగా సిటీ అని ఇప్పటికే టీడీపీ తమ్ముళ్లు అంటున్నారు. విశాఖ చుట్టూ రాజకీయం చేస్తూ పోతున్న నేపధ్యంలో సిటీ ఆఫ్ డెస్టినీకి కొత్త అర్ధాలు కూడా చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు.