మ‌న‌ల్ని ఎవ‌ర్రా అడ్డుకునేది…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మిలోని రాజ‌కీయ పార్టీల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల వైఖ‌రి… మ‌న‌ల్ని ఎవ‌ర్రా అడ్డుకునేది అన్న‌ట్టుంది. అధికారం చేతిలో వుంటే, ఏమైనా చేయొచ్చ‌నే ధోర‌ణి వారిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌తంలో వైసీపీ ఇలాంటి వైఖ‌రితో ప‌ది…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మిలోని రాజ‌కీయ పార్టీల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల వైఖ‌రి… మ‌న‌ల్ని ఎవ‌ర్రా అడ్డుకునేది అన్న‌ట్టుంది. అధికారం చేతిలో వుంటే, ఏమైనా చేయొచ్చ‌నే ధోర‌ణి వారిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌తంలో వైసీపీ ఇలాంటి వైఖ‌రితో ప‌ది శాతం త‌ప్పులు చేస్తే, ఆ ప్ర‌భుత్వ స్ఫూర్తితో ఇప్పుడు వీళ్లు ప‌దింత‌లు ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందుకు అధికార పార్టీ పెద్ద‌ల వైఖ‌రి కూడా కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు న‌ర్సీప‌ట్నంలో న‌డిరోడ్డుపై మున్సిప‌ల్ అధికారుల్ని ప‌చ్చిబూతులు తిట్టారు. అయినా ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇది స‌రైంది కాద‌ని వారించలేదు. మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ప‌చ్చ బిళ్ల‌ల్ని త‌గిలించుకుని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వెళ్లాల‌ని సూచించారు. అధికారులు మ‌ర్యాద‌లు చేస్తార‌ని, ఒక‌వేళ ఎవ‌రైనా ప‌నులు చేసి పెట్ట‌క‌పోతే వారి అంతు చూస్తాన‌ని హెచ్చ‌రించారు.

హోంమంత్రి అనిత ఏం మాట్లాడుతున్నారో వింటున్నాం. పోలీసులు, అలాగే సంబంధిత అధికారుల్లో ఇంకా ఎవ‌రైనా జ‌గ‌న్ అభిమానులు వుంటే రాజీనామాలు చేసి వెళ్లాల‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. తాము చెప్పిన‌ట్టు న‌డుచుకోవాల‌ని ఆమె కోరుతున్నారు. ఎక్క‌డైనా ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టే అధికారులు న‌డుచుకుంటార‌నే సంగ‌తి ఆమెకు తెలియ‌ద‌ని అనుకోలేం. కానీ నిత్యం పోలీస్ సిబ్బందితో ఆమె మైండ్ గేమ్ ఆడుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

రెండు రోజుల క్రితం రాయ‌చోటిలో మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి భార్య హ‌రిత ఓ ఎస్ఐతో దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ఆమె వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబునాయుడు సీరియ‌స్ అయ్యారు.

తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఎం.కొండూరు మండ‌లం కంభంపాడులో వైసీపీ ఎంపీపీ నాగ‌ల‌క్ష్మి కుటుంబం అక్ర‌మంగా భ‌వ‌నం నిర్మిస్తోందంటూ ఎమ్మెల్యే కె.శ్రీ‌నివాస్ ఏకంగా పొక్లెయిన్‌, డోజ‌ర్‌తో వెళ్లారు. కొంత భాగం ధ్వంసం చేశారు. పోలీస్‌, రెవెన్యూ అధికారులు వ‌ద్ద‌ని వారిస్తున్నా ఆయ‌న విన‌కుండా చ‌ట్టాన్ని త‌నే చేత‌ల్లోకి తీసుకుని జాతీయ ర‌హ‌దారిపై సినీ ఫ‌క్కీలో ఆయ‌న చేసిన వీరంగం అంతాఇంతా కాదు.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అధికారం చేతిలో వుంద‌ని, త‌మ‌నెవ‌రూ నిలువ‌రించ‌లేర‌నే లెక్క‌లేని త‌నంతో విర‌వీగుతున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. పోలీసులు కూడా చ‌ర్య‌లు తీసుకోడానికి భ‌య‌ప‌డుతున్నారు. ఒక‌వేళ ఎక్క‌డైనా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల ఆగ‌డాల‌ను అడ్డుకుందామ‌ని అనుకున్నా, వైసీపీ ముద్ర‌వేసి వేధింపులకు పాల్ప‌డుతార‌నే భ‌యం పోలీసులు, రెవెన్యూ, ఇత‌ర శాఖ‌ల అధికారుల్లో క‌నిపిస్తోంది. అందుకే చాలా త్వ‌రగానే కూట‌మి ప్ర‌భుత్వంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.