కడుపులో కత్తులు అలాగే ఉన్నాయ్..!

కడుపులో కత్తులు పెట్టుకుని పైకి చిరునవ్వులు చిందిస్తూ ఉంటారనేది సామెత. పైకి మాత్రం స్నేహం నటిస్తూ లోలోపల కక్షతో రగిలిపోయే వ్యక్తుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు.  Advertisement ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాంటి…

కడుపులో కత్తులు పెట్టుకుని పైకి చిరునవ్వులు చిందిస్తూ ఉంటారనేది సామెత. పైకి మాత్రం స్నేహం నటిస్తూ లోలోపల కక్షతో రగిలిపోయే వ్యక్తుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. 

ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాంటి పరిస్థితులే కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి కూడా.. తమ స్వార్థం కోసం తెలుగుదేశంలోకి ఫిరాయించిన నాయకులకు ఆ పార్టీ లో తొలినుంచి ఉన్న వారితో ఇలాంటి స్పందన ఎదురవుతోంది. పైకి కడుపుమంట కనిపించనివ్వకుండా చిరునవ్వులు చిందిస్తున్నారు గానీ.. లోలోపల రగిలిపోతున్నారు. ఇందుకు ఉదాహరణ లాంటి సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. 

ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ని ఆ పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో అనేక రకాల ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న మేకపాటిని జగన్ ముందే హెచ్చరించారు. అయితే ఆయన తరహా మారలేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయనకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని జగన్ సంకేతాలు పంపినట్లుగా కూడ ప్రచారం జరిగింది. దీంతో ఆగ్రహించిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో తెలుగుదేశానికి ఓటు వేశారు. పర్యవసానంగా పార్టీనుంచి బహిష్కరణకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరకపోయినప్పటికీ వారి పంచన ప్రస్తుతానికి బతుకుతున్నారు. 

వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం టికెట్ ఇస్తుందనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. బహుశా అందుకే ముందు జాగ్రత్త చర్య లాగా.. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి లేదు అని ఒకవైపు చంద్రశేఖర రెడ్డి చెప్పుకుంటున్నారు. మరోవైపు తెలుగుదేశం నాయకులను కలుస్తూ వారితో మంతనాలు సాగిస్తున్నారు. 

మూడు దఫాలు తనతో ఎమ్మెల్యే ప్రత్యర్ధిగా తలపడిన బొల్లినేని వెంకటరామారావును తాజాగా కలిశారు. అదివరకు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేగా చేసిన కంభం విజయరామిరెడ్డిని కూడా కలిశారు. రాజకీయంగా వేరే గత్యంతరం లేదు గనుక.. ఈ నాయకులను కలుస్తున్నట్టుగా ఉన్నది గానీ.. లోలోపల వారి మధ్య శత్రుత్వాలు, వైషమ్యాలు అలాగే ఉన్నాయేమో అనిపిస్తోంది. 

బొల్లినేని కార్యాలయానికి మేకపాటి వచ్చినప్పుడు.. ఆయన తెలుగుదేశం కార్యకర్తలను చూపిస్తూ ‘‘వీరిలో చాలా మంది మీ బాధితులే’’ అని పరిచయం చేయడం గమనార్హం. వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన దూకుడు వల్ల కేసులు అనుభవిస్తూ, ఇతర ఇబ్బందులు పడ్డాం అన్నట్లుగా ఆ మాట చెప్పారు. 

ఇప్పుడు మేకపాటి ఇటు ఫిరాయించినంత మాత్రాన.. వారంతా తమ కడుపులో ఉన్న శత్రుత్వాన్ని మర్చిపోతారా? అనేది ప్రశ్న. కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందని అన్నట్టుగా.. పరిచయాలు చేసుకుంటున్న నాడే ఆయన పెట్టిన వేధింపులను గుర్తు చేసుకుంటున్నారంటే.. ఇక వారి కాపురం ఎలా సాగుతుందో మరి! అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.