టీడీపీతో విజయవాడ ఎంపీ కేశినేని నానికి రోజురోజుకూ ఎడబాటు పెరుగుతోంది. టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు గెలిస్తే, వారిలో కేశినేని నాని ఒకడు. టీడీపీతో తనకు సంబంధాలు లేవనే సంకేతాల్ని పంపడానికే ఆయన ఆసక్తి చూపుతున్నారు. కేశినేని నాని వ్యవహార శైలిపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నప్పటికీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తనకు వ్యతిరేకంగా సొంత తమ్ముడినే టీడీపీ అధిష్టానం ఎగదోస్తోందనే ఆగ్రహం కేశినేని నానిలో ఉంది.
అలాగే టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరా తదితరులు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారనేది కేశినేని ఆరోపణ. వారి వెనుకాల కొందరు టీడీపీ ముఖ్య నేతలున్నారని కేశినేని మండిపడుతున్నారు. ఇలా చిన్నచిన్న అంశాలే పెద్దవై పార్టీపై కేశినేని కోపానికి కారణమయ్యాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి డుమ్మా కొట్టి తన నిరసనను మరోసారి కేశినేని నాని ప్రదర్శించారు. ఈ సమావేశాన్ని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. దేవినేని ఉమాతో కేశినేని వైరం ఈనాటిది కాదు. ఇద్దరి మధ్య అసలు పొసగదు.
గతంలో టీడీపీ పాలనలో మంత్రి దేవినేనిపై కేశినేని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అలాంటి దేవినేని ఉమా నేతృత్వంలో సాగే సమావేశానికి నాని వెళ్లడమా?… ఎప్పటికీ జరగదని ఎంపీ అనుచరులు చెబుతున్నారు.
ఆ మధ్య ఢిల్లీలో చంద్రబాబుకు బొకే ఇవ్వడానికి కూడా కేశినేని నాని నిరాకరించడం పెద్ద చర్చనీయాంశమైంది. ఇటీవల బీజేపీ జాతీయ నాయకుడు, ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ దియోధర్ ఇంట్లో గణపతి పూజకు కేశినేని వెళ్లారు. దీంతో బీజేపీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారనే చర్చకు తెరలేచింది.
అనేక కారణాల వల్ల టీడీపీలో కేశినేని నాని ఇమడలేకున్నారనేది వాస్తవం. ముందు టీడీపీకి దూరంగా ఉంటున్న సంకేతాల్ని ఆయన ఇవ్వదలుచుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల నాటికి ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోవచ్చని ఆయన ఆలోచిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతానికి కేశినేని నాని వ్యవహారం టీడీపీకి మింగుడు పడడం లేదు.