బాబును న‌మ్మ‌ర‌ని…తెర‌పైకి టోకెన్లు!

ఎన్నిక‌ల హామీల్లో చంద్ర‌బాబు చిత్త‌శుద్ధి ఏపాటితో తెలుగు ప్ర‌జానీకానికి బాగా తెలుసు. ప‌బ్బం గ‌డుపుకునేందుకు చంద్ర‌బాబు ఎలాంటి హామీలైనా ఇస్తార‌ని, అవ‌స‌రం గ‌డిచాక బోడిమ‌ల్ల‌న్న అంటార‌ని తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎన్నో అనుభ‌వాలున్నాయి. చంద్ర‌బాబు అంటేనే…

ఎన్నిక‌ల హామీల్లో చంద్ర‌బాబు చిత్త‌శుద్ధి ఏపాటితో తెలుగు ప్ర‌జానీకానికి బాగా తెలుసు. ప‌బ్బం గ‌డుపుకునేందుకు చంద్ర‌బాబు ఎలాంటి హామీలైనా ఇస్తార‌ని, అవ‌స‌రం గ‌డిచాక బోడిమ‌ల్ల‌న్న అంటార‌ని తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎన్నో అనుభ‌వాలున్నాయి. చంద్ర‌బాబు అంటేనే వంచ‌న‌, మోసం, కుట్ర‌ల‌కు ప‌ర్యాయ‌ప‌దంగా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తుంటాయి. ఇటీవ‌ల మ‌హానాడులో మినీ మేనిఫెస్టోను చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

ఇదో అద్భుత‌మైన మేనిఫెస్టో అని, వైసీపీ గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయ‌ని చంద్ర‌బాబు రెచ్చిపోతున్నారు. అయితే క్షేత్ర‌స్థాయిలో అంత సీన్ లేద‌నే టాక్ వినిపిస్తోంది. నిన్ను న‌మ్మం బాబు అని మెజార్టీ ప్ర‌జానీకం చెబుతోంది. ఈ నేప‌థ్యంలో బాబు హామీల అమ‌లుపై న‌మ్మ‌కం క‌లిగించ‌డం టీడీపీకి పెద్ద టాస్క్‌గా  మారింది. దీంతో తాము అధికారంలోకి వ‌స్తే సంక్షేమ ప‌థ‌కాల‌ను చిత్త‌శుద్ధితో అమ‌లు చేస్తామ‌నే న‌మ్మ‌కాన్ని జ‌నంలో క‌లిగించేందుకు టీడీపీ కొత్త ఎత్తుగ‌డ వేసింది.

ఈ నేప‌థ్యంలో ల‌బ్ధిదారుల‌కు సంబంధించి టోకెన్ల‌ను ఎన్నిక‌ల‌కు ముందే పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మినీ మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన త‌ల్లికి వంద‌నం సంక్షేమ ప‌థ‌కానికి సంబంధించి అర్హులైన పిల్ల‌లంద‌రికీ ఎన్నిక‌ల‌కు ముందే టోకెన్లు పంపిణీ చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం విశేషం. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అర్హులంద‌రికీ అమ్మ ఒడి ఇస్తాన‌ని చెప్పి, కొంద‌రికే ప‌రిమితం చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. తాము అలా చేయ‌మ‌ని చెప్ప‌డం ఆయ‌న ఉద్దేశం.

అయితే ఆంధ్రుల భ‌విష్య‌త్‌కు గ్యారెంటీ పేరుతో ప్ర‌క‌టించిన మిగిలిన సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించిన ల‌బ్ధిదారుల‌కు కూడా ఇదే రీతిలో టోకెన్ల పంపిణీపై ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. కేవ‌లం త‌ల్లికి వంద‌నం సంక్షేమ ప‌థ‌కానికే మాత్ర‌మే టీడీపీ ప‌రిమితం కావ‌డం ఏంట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. అన్న‌దాత ప‌థ‌కం కింద ప్ర‌తి రైతుకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిరైతుకు ఇదే ర‌కంగా టోకెన్లు ఇస్తారా? ఇవ్వ‌క‌పోతే అన‌వ‌స‌రంగా వారిలో కొత్త అనుమానాల్ని క‌లిగిస్తున్న‌ట్టు అవుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.