సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోసం ఆన్‌లైన్‌లో మహా పోరు సాగుతున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆయన గారికి వెంటనే పోస్టింగ్ ఇచ్చి, ఎంతో గౌరవంగా పదవీ విరమణ చేయించాలని ఎల్లో బ్యాచ్ నుంచి డిమాండ్ వెల్లువెత్తుతోంది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తుత దుస్థితికి కారణమైన టీడీపీ మాత్రం నోరు మెదపడం లేదు. ఆయనకు న్యాయం చేయాలని కోరేందుకు టీడీపీ తెరపైకి వచ్చి సాహసించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని ఎల్లో బ్యాచ్ మార్క్ ఆన్‌లైన్ ఉద్యమాన్ని నడిపిస్తోంది. ఈ సందర్భంగా వేలాది మంది సంతకాలు చేసి రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతులు పంపడం గమనార్హం. ఇన్ని వేల మంది ఆన్‌లైన్ ఉద్యమం చేస్తుంటే, టీడీపీ ఎందుకని మౌనవ్రతంలో ఉందనే ప్రశ్న ఉత్పన్నమైంది.
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో నిఘా అధికారిగా ఏబీ వెంకటేశ్వరరావు చేయకూడని తప్పులు చేశారని వైసీపీ ఆరోపణ. వైసీపీ నేతల సెల్‌ఫోన్లను ట్యాప్ చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు నివేదించేవారని అప్పట్లో కేంద్ర హోంశాఖకు కూడా వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలులో తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇంకా అనేక క్రిమినల్ కేసులు ఆయనపై ఉన్నాయి. వాటికి సంబంధించి కేసులు నడుస్తున్నాయి.
ఏబీవీ సస్పెన్షన్‌ను ఇటీవల క్యాట్ తప్పు పట్టింది. దీంతో ఆయనకు క్లియరెన్స్ వచ్చిందని, వెంటనే డీజీపీ పదవి కట్టబెట్టాలని ఎల్లో బ్యాచ్ డిమాండ్ చేస్తోంది. ఇదే సందర్భంలో ఏబీవీపై క్రిమినల్ కేసులకు సంబంధించి విచారణకు కేంద్ర హోంశాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది. దీంతో ఏబీ కేసుల కథ మళ్లీ మొదటికొచ్చింది. క్యాట్ క్లియరెన్స్ ఇచ్చినా పోస్టింగ్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రోజులు లెక్క పెడుతోంది.
మరోవైపు ఆయన ఈ నెలాఖరులో పదవీ విరమణ చేస్తారని, ఇప్పటికైనా ఆయన్ను గౌరవంగా సాగనంపాలని ఒక వర్గం వాదిస్తోంది. గతంలో ఆయన్ను వాడుకున్నోళ్లే ఆన్‌లైన్ ఉద్యమంతో పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే వాదన లేకపోలేదు. అందుకే ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. టీడీపీ మాత్రం వెనుక నుంచే కథ నడిపిస్తోంది. ఆయనకు నేరుగా అండగా నిలిచేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.