లోకేష్ పాదయాత్ర కడప జిల్లాలో సాగుతోంది. పూనకం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద లోకేష్ ఎడాపెడా రెచ్చిపోతున్నారు.కొన్ని విమర్శలు, కొన్ని నిందలు, కొన్ని దూషణలు.. లోకేష్ కడప జిల్లా దాటేలోగా.. పెద్ద రభస చేయాలని ముందుగానే డిసైడ్ అయినట్లుగా చెలరేగిపోతున్నారు.
అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగితే, దానిని ఆధారం చేసుకుని.. ‘నా మీద హత్యాప్రయత్నం చేశారు.. మీ తప్పుల్ని ఎత్తిచూపితే చంపేస్తారా..’ లాంటి చవకబారు డైలాగులతో ఇంకా రెచ్చిపోవాలనేది లోకేష్ ప్లాన్. కానీ ఆయన అనుకున్నట్టుగా ఏమీ జరగడం లేదు. కడపజిల్లాలో ఉండే వైసీపీ శ్రేణులో, జగన్ అభిమానులు లోకేష్ పాదయాత్రను పట్టించుకోవడం లేదు. మాటలను సీరియస్ గా తీసుకోవడం లేదు. మహా అయితే ప్రొద్దుటూరులో లోకేష్ మీదకు జనంలోంచి కొందరు కోడిగుడ్లు విసరడం మాత్రం జరిగింది.
అలా కోడి గుడ్లు విసరడం కూడా తప్పే.కానీ ఆ ఆకతాయి పనిని ఆధారం చేసుకుని.. నారా లోకేష్ ను చంపేయడానికి కుట్ర జరుగుతున్నదంటూ చవకబారు రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ దిగజారుతోంది.
యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు ఏ చిన్న ప్రమాదం జరిగినా రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు తదితరులు రాష్ట్ర గవర్నరును కలిసి ఫిర్యాదు చేశారు.
ఇక్కడ తమాషా ఏంటంటే.. నారా లోకేష్ కడప జిల్లాలోనే నానా అవాకులు చెవాకులు పేలారు. కోడికత్తికి భయపడే వంశం మీది.. క్లెమోర్ మైన్స్ కు కూడా భయపడని వంశం మాది.. అంటూ అసందర్భంగా వంశాల ప్రస్తావన కూడా తెచ్చారు. మరి క్లెమోర్ మైన్ లకు కూడా భయపడనని బహిరంగ వేదికల మీద టముకు వేసుకుంటూనే.. కోడిగుడ్డుకు మాత్రం జడుసుకుని.. ప్రాణభయం ఉన్నదంటూ గవర్నరు దగ్గరకు తన మనుషులను పంపి మొరపెట్టుకోవడం అనేది చాలా కామెడీగా ఉంది.
ప్రాణాపాయం ఉన్నదంటూ, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ తెలుగుదేశం ఆరోపిస్తున్న నేపథ్యంలో వారు చెప్పిన ఉదాహరణలే కామెడీకి పరాకాష్ట. కోడిగుడ్లు విసరడాన్నే ప్రాణాపాయంగా చెబుతున్నారు. ఆ ఆకతాయిలను పోలీసులు అరెస్టు కూడా చేసిన తర్వాత.. డీఎస్పీ పట్టించుకోలేదని నింద వేస్తున్నారు. అదే సమయంలో లోకేష్, చంద్రబాబులకు వ్యతిరేకంగా ఫ్లెక్సిలు కట్టడాన్ని కూడా గవర్నరు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజకీయాల్లో తమ నిరసనను వ్యక్తం చేయడానికి చాలా సులువైన మార్గంగా ఫ్లెక్సి ఉంది. ఫ్లెక్సి కట్టి నిరసన తెలియజేస్తే.. అది కూడా ప్రాణాపాయంగా భావిస్తూ జడుసుకుంటున్నారు. చూడబోతే.. కడపజిల్లాలో ఉండగా.. ఓ పెద్ద ప్రమాదం, దాడి జరిగితే తప్ప తనకు మైలేజీ రాదనే ఉద్దేశంతో, వైసీపీ వారిని మరింత రెచ్చగొట్టడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నట్టు పలువురు భావిస్తున్నారు.