తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తమ పార్టీ తరఫున ఏడాదికోసారి నిర్వహించుకునే వేడుక మహానాడును వాయిదా వేశారు! ఎన్నికల కారణంగా ఈసారి మహానాడును వాయిదా వేయాల్సి వస్తున్నట్టు చంద్రబాబునాయుడు.. పార్టీ నాయకులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో తేల్చి చెప్పేశారు.
ఎన్నికల ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి ఉండాల్సి ఉన్నందున ఈసారి మహానాడు లేదని అన్నారు. అయితే 120- 135- 150- 160 సీట్లు దక్కుతాయని అంటూ తెలుగుదేశం పార్టీ విర్రవీగుతూ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో.. మహానాడు వేడుకలు చేసుకోవడానికి ఫలితాలు వెలువడే వరకు ఆగవలసిన అవసరం ఏమిటి? గెలుపు గురించి వారు వ్యక్తం చేస్తున్న నమ్మకం మొత్తం చిల్లర ట్రిక్కులు మాత్రమేనా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ నిర్వహించే వార్షిక వేడుక మహానాడు. అయితే చంద్రబాబునాయుడు అనేక సందర్భాల్లో మహానాడును స్కిప్ చేయడానికి సాకులు వెతుకుతూ ఉంటారనే అభిప్రాయం పార్టీలోని కొందరు సీనియర్లలో ఉంది. కరోనా కారణంగా కూడా ఇటీవలి రెండు సంవత్సరాల్లో నిర్వహించలేదు. 2022, 2023 లలో మాత్రం నిర్వహించారు. గత ఏడాది మహానాడు సందర్భంగానే.. సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రకటించడం జరిగింది.
ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత.. తెలుగుదేశం వారంతా తాము ఇన్ని సీట్లు గెలుస్తున్నాం, అన్ని సీట్లు గెలుస్తున్నాం అని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆ సీట్ల గారడీపై వారికి నమ్మకం ఉన్నది నిజమే అయితే గనుక.. ఎందుకు వేడుక చేసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. గెలుపు గురించి చెబుతున్నవన్నీ డాంబికపు మాటలు మాత్రమే.. తెలుగుదేశం నాయకులను లోలోపల ఓటమి భయం వెన్నాడుతోంది అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతానికి మహానాడు లేదని చంద్రబాబు అంటున్నారు గానీ.. ఫలితాలు వెలువడిన తర్వాత ఆ పార్టీ గెలిచినా కూడా ఆయన నిర్వహించబోయేది కూడా ఉండదని పార్టీ వర్గాల అంచనా! ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్న చంద్రబాబునాయుడు.. గెలిస్తే జూన్ జులై నెలల్లో మహానాడు నిర్వహిస్తారని.. ఆ రకంగా.. ఎన్టీఆర్ జయంతి ని వేడుకల నుంచి దూరం చేస్తారని, అదే చంద్రబాబునాయుడు కుట్ర అని కూడా పార్టీలోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.