ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి టీడీపీ సీనియర్ నేతలు ఓ ప్రశ్న సంధిస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపకాలపై దృష్టి సారిస్తానని చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయిలో బాగా పని చేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు అనడంపై టీడీపీ సీనియర్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సూత్రాన్ని మంత్రి పదవుల పంపకాలపై బాబు ఎందుకు పాటించలేదని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా కొంత మంది మంత్రుల పేర్లను నేరుగానే బాబుకు గుర్తు చేస్తూ… టీడీపీకి వీరు ఏ సేవ చేశారని అమాత్య పదవులు ఇచ్చారో చెప్పాలని సీనియర్ నేతలు నిలదీస్తున్నారు. ఉదాహరణకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారని గుర్తు చేయడం గమనార్హం. టీడీపీ ఆవిర్భావం నుంచి వుంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు తదితర నేతలకు మొండిచెయ్యి ఎందుకు చూపారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.
తమకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా బాధ లేదని కొంత మంది సీనియర్ నేతలు పైకి చెబుతున్నప్పటికీ, సన్నిహితుల వద్ద మాత్రం బాబు వైఖరిని తప్పు పడుతున్నారు. ఇందుకేనా పార్టీ కోసం సమస్తం త్యాగం చేసిందని వారు వాపోతున్నారు. నామినేటెడ్ పదవులకైతే ఒక నీతి, మంత్రి పదవులకైతే మరొకటా? అని వారు ఆగ్రహంతో నిలదీస్తున్నారు. అయితే బాబును ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరుగా ఇదేమని ప్రశ్నించలేమనే నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.