మే 23 కలసి రాలేదు.. 13 ఏం చేస్తుందో?

టీడీపీకి 3 నంబర్ వింటేనే కంపరం కలవరం అని సెటైర్లు పేల్చుతారు అంతా. 2019లో మే 23న కౌంటింగ్ జరిగింది. టీడీపీకి 23 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ తరువాత అదే నంబర్ టీడీపీని…

టీడీపీకి 3 నంబర్ వింటేనే కంపరం కలవరం అని సెటైర్లు పేల్చుతారు అంతా. 2019లో మే 23న కౌంటింగ్ జరిగింది. టీడీపీకి 23 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ తరువాత అదే నంబర్ టీడీపీని అనేక సందర్భాలలో వెంటాడుతూనే ఉంది. ఆఖరుకు చంద్రబాబు 53 రోజులు జైలులో ఉంటే ఆయనకు ఇచ్చిన నంబర్ కూడా అన్నీ కూడితే 23 వచ్చిందని కూడా కామెంట్స్ పెట్టేవారు అంతా.

ఈ నంబర్ల గొడవ మరోసారి వచ్చి పడింది. ఏపీలో నాలుగవ దశలో ఎన్నికలు జరిపిస్తున్నారు. మే 13న పోలింగ్ అని ఎన్నికల సంఘం ముహూర్తం ఫిక్స్ చేసింది. దాంతో ఇపుడు ఈ నంబర్ ఎవరికి మంచిది ఎవరికి చెడ్డది అన్న డిస్కషన్ సోషల్ మీడియా వేదికగా మొదలైంది. పదమూడు కాకుండా పద్నాలుగు అయినా ఏమో కానీ పక్కన మూడు ఉండడంతో టీడీపీకి అది యాంటీ నంబరా అని కూడా కొందరు అంటూంటే కాదు ఈసారి మంచి నంబరే అవుతుందని మరి కొందరు అంటున్నారు.

మూడు పదమూడు ఇరవై మూడూ ఈ గొడవ ఏమిటి అని మరి కొందరు అంటున్నారు. గత కొన్ని ఎన్నికలు చూస్తే అన్నీ ఏప్రిల్ లోనే జరిగాయి. ఈసారి మాత్రం మే లోకి వెళ్లాయి. మే ఎన్నికలు ఎవరికి మేలు అంటే మళ్లీ అదే చర్చ.  గతంలో 23న కౌంటింగ్ జరిగింది టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఈసారి 13న పోలింగ్ జరుగుతోంది కాబట్టి టీడీపీకి 13 సీట్లే వస్తాయని వైసీపీ వారు అంటూంటే కాదు ఈసారి తాము గెలుస్తామని టీడీపీ సపోర్టర్లు వాదిస్తున్నారు.

ఏది ఎలా ఉన్నా ఈ 13 నంబర్ మాత్రం ఎందుకో తెలియకుండానే కలవరపెడుతోంది అని అంటున్నారు. 13 కొన్ని దేశాలకు అన్ లక్కీ నంబర్. దాంతో పాటు దురదృష్ట సంఖ్య అని సంఖ్యాశాస్త్రం తెలిసిన వారు చెబుతారు. అయితే ఒకరికి అది అదృష్టమే కదా అన్నది లాజిక్ పాయింట్. అలా ఎవరికి అది లక్కీ నంబర్ ఎవరికి అన్ లక్కీ అంటే ఆ సంగతి తెలియాలంటే జూన్ 4 దాకా వేచి ఉండాలి. ఆ రోజున కౌంటింగ్ కాబట్టి అసలైన ప్రజా తీర్పు వస్తుంది కాబట్టి.