సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై టీడీపీ కక్షతో వ్యవహరిస్తోంది. ఒకవైపు చంద్రబాబునాయుడి ప్రభుత్వం కక్ష, ప్రతీకార రాజకీయాలకు దూరమనే కలరింగ్ ఇస్తూ, ఆచరణ చూస్తే గత ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరించలేదనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది తొలగింపుపై టీడీపీ అనుకూల మీడియా రాసిన కథనం చర్చనీయాంశమైంది.
గతంలో చంద్రబాబునాయుడిని కింద కూర్చోపెట్టిన గోపాలకృష్ణ ద్వివేదికి కొత్త ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఆ పార్టీ సోషల్ మీడియా అభ్యరంతరం వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన సదరు అధికారికి ప్రాధాన్యం ఇవ్వొద్దని టీడీపీ సోషల్ మీడియా చంద్రబాబుకు సూచించింది. దీంతో చంద్రబాబు సర్కార్ గోపాలకృష్ణ ద్వివేది విషయంలో తప్పిదాన్ని సరిదిద్దుకున్నట్టుగా … ఆ పార్టీ అనుకూల పత్రిక కథనం చదివితే అర్థమవుతుంది.
2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు. అప్పుడు ఎన్నికల కార్యాలయానికి వెళ్లి గోపాలకృష్ణ ద్వివేదిపై చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి ద్వివేదిని చంద్రబాబునాయుడు నాడు బెదిరించడంపై తీవ్ర విమర్శ వెల్లువెత్తింది. నాటి ఘటనను గుర్తుకు తెస్తూ, గోపాలకృష్ణ ద్వివేదికి ఎలా ప్రాధాన్యం ఇస్తారని టీడీపీ అనుకూలురు ప్రశ్నించడం, ఆయన్ను తొలగించడం గమనార్హం.
2019లో చంద్రబాబును దారుణంగా ఓడించారని జనంపై కూడా ఇదే రీతిలో కక్ష తీర్చుకుంటారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. 2019 ఎన్నికల్లో ఓడించారు కాబట్టి, ఇప్పుడు గల్లాపెట్టెలో నిధులు లేని కారణంగా హామీలన్నీ బుట్టదాఖలు చేస్తారా? అనే నిలదీత ఎదురవుతోంది. కక్ష, ప్రతీకారం ఒక స్థాయి వరకూ పట్టించుకోరు. శ్రుతిమించితే ఏమవుతుందో, సమాధానం చెప్పడానికి కాలం ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది.
ఇదిలా వుండగా, ద్వివేది వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. అలాంటి అధికారిపై కక్ష కట్టడం చంద్రబాబు సర్కార్‌కు శోభనివ్వదని గుర్తించుకోవాలి. ప్రభుత్వాధికారులు అధికార పార్టీ చెప్పినట్టు కాకుండా, ప్రతిపక్షం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటారా? ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా కాకుండా, వైసీపీ చెప్పినట్టు అధికారులు పని చేస్తారా? అర్థం లేని వాదనలతో సీనియర్ ఐఏఎస్ అధికారులను పక్కన పెడుతూ పోతే, చివరికి ఎవరూ మిగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.