విశాఖలోని శ్రీ శారదాపీఠం భక్తులకు ఆలవాలం. ఇక్కడ రాజశ్యామల అమ్మవారి దర్శనం కోసం ఆశ్రితులు అంతా వస్తూంటారు. ప్రత్యేకంగా రాజకీయ నాయకులు వస్తారు. రాజ్యశ్యామల అమ్మవారి దయ ఉంటే తమ కోరికలు ఈడేరుతాయన్నది ప్రగాఢ నమ్మకం. రాజశ్యామల యాగాన్ని కూడా ప్రతీ ఏటా వార్షికోత్సవం వేళ పీఠంలో చేస్తూ వస్తారు.
ఏడాది పొడవునా సాధారణ భక్తులతో పాటు రాజకీయ నాయకులు కూడా పీఠానికి రావడం సాధారణమైన విషయం. అయితే ఇటీవల కాలంలో తెలంగాణా నుంచి రాజకీయ నేతల తాకిడి తగ్గింది. ఒకనాడు కేసీఆర్ ఏరి కోరి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీని పిలిపించుకుని మరీ హైదరాబాద్ లో రాజశ్యామల యాగాన్ని విజయవంతంగా చేయించారు.
రెండవసారి కేసీఆర్ సీఎం కావడానికే ఈ యాగం అని అంతా చర్చించుకున్నారు. అలా కేసీఆర్ రెండవసారి సీఎం అయ్యాక పీఠానికి స్వయంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు. నాలుగేళ్ల నుంచి మళ్ళీ అధికార బీఆర్ఎస్ నేతల రాక అయితే పెద్దగా లేదు. తాజాగా తెలంగాణాకు చెందిన ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే పీఠంలో జరుగుతున్న అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి మంత్రి తెలుసుకున్నారు. రానున్న రోజులలో మరింతమంది బీఆర్ఎస్ మంత్రులు పీఠానికి రావచ్చు అని అంటున్నారు. బీఆర్ఎస్ గా మారాక ఏపీలో కూడా రాజకీయ కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపధ్యంలో మళ్లీ పీఠానికి తెలంగాణా నుంచి రాజకీయ భక్తుల తాకిడి పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈసారి దేశంలో బీఆర్ఎస్ బలంగా మారేలా తన ఉనికికి చాటుకునేలా రాజశ్యామల అమ్మవారి దీవెనల కోసం మరో యాగాన్ని కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారంలో ఉంది.