జనసేనాని పవన్‌కల్యాణ్ తన అజ్ఞానంతో కోరి సమస్యలు తెచ్చుకుంటుంటారు. లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానిగా ఆయన చెప్పుకుంటారే తప్ప, ఆచరణలో అజ్ఞానమే ఎక్కువగా కనిపిస్తోంటోంది. ఆయన అజ్ఞానానికి మచ్చు తునక… ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చే వరకూ తెలంగాణ సమాజానికి వరి అన్నం అంటే ఏంటో తెలియదని చెప్పడం. అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడంలో పవన్‌కు ఆయనే సాటి.
తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడ్డంతో ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి కోపం వచ్చింది. పవన్‌పై ఆయన బండబూతులు తిట్టారు. తెలంగాణ మంత్రి ఘాటు వ్యాఖ్యలపై జనసేన కిక్కురమనకపోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే… ఇటీవల ఏపీలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వచ్చే వరకూ తెలంగాణకు వరి అన్నం అంటే తెలియదన్నారు. తమకు రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చాడని ఓ మహిళ చెప్పిందన్నారు.
బియ్యం అంటే ఎలా వుంటుందో తెలియదన్నారని పవన్ తెలిపారు. తన జల్సా సినిమాలో అది ఉన్నట్టు చెప్పారు. పండగకో పబ్బానికో తెలంగాణలో అన్నం వండుకుంటారన్నారు. తెలంగాణలో వరి పండేది కాదన్నారు. కేవలం రాగి లాంటి పంటలు మాత్రమే పండేవన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సీరియస్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. “వాడెవడో సినిమా యాక్టర్…పనికిమాలినోడు నిన్ననో మొన్ననో మాట్లాడినాడు. తెలంగాణ వాళ్లకు వరి అన్నడం తినడాన్ని ఎన్టీఆర్ వచ్చి నేర్పినాడంట. వాళ్లంత మూర్ఖులను ఇప్పటి వరకూ నేను చూడలేదు. 1100, 1200 సంవత్సరాల క్రితమే కాకతీయుల కాలంలో తెలంగాణలో చెరువుల కింద వరి పండించారు. దాని కొనసాగింపుగా ఇప్పటికీ తెలంగాణలో వరి పండిస్తున్నారు. చరిత్ర తెలియని మూర్ఖులు మాట్లాడుతుంటారు. ఆ తర్వాత వాళ్ల మూర్ఖపు, పక్షపాత పరిపాలన వల్ల తెలంగాణలో పండాల్సిన భూముల్ని ఎడారిగా మార్చారు. రైతుల్ని వలసపోయేలా చేసిన దుర్మార్గులు. భారతదేశంలో వరి పండించడంలో తెలంగాణ నెంబర్ ఒన్” అని ఆయన అన్నారు.
తనను వైసీపీ విమర్శిస్తే… చెప్పుతో కొడ్తానని చెలరేగిపోయిన పవన్…ఇప్పుడు తెలంగాణ మంత్రి ఘాటు వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మంత్రి, ఆ రాష్ట్ర అధికార పార్టీ నేతలపై చెప్పు ఎత్తే పరిస్థితి వుందా? కనీసం కౌంటర్ ఇవ్వగలిగే దమ్ము, ధైర్యం జనసేనానికి , ఆ పార్టీ కార్యకర్తలకు ఉన్నాయా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.