పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ నే తన అవసరానికి తగ్గట్టుగా వాడుకుని.. అవసరం అయినప్పుడు ఆయనో దేవుడు, అవసరం తీరాకా ఆయనో విలువల్లేని మనిషి.. అని బాహాటంగా తన అభిప్రాయాలను చెప్పి, అనుకూల మీడియా చేత తన అభిప్రాయాలనే అందరిచేతా నిజమనిపించేలా గోబెల్స్ ప్రచారాన్ని చేపట్టిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ పేరును తన అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడంలోనే తన నేర్పును చంద్రబాబు దశాబ్దాల కిందటే చూపించారు. ఆ తర్వాత ఆయన ఆటల్లో ఎంతో మంది అరటి పండ్లు అయ్యారు!
చంద్రబాబు నెత్తికెత్తుకున్న వాళ్లు, అవసరం తీరాకా ఆయన బుట్టదాఖలు చేసిన వ్యక్తుల జాబితా తీసి, ఆ ఉదంతాల గురించి రాస్తే.. రాజకీయంగా అదో గ్రంథం అవుతుంది! రాజకీయం ఎంత ప్రమాదకరమైన ఆటనో.. చంద్రబాబు- ఆయన చేత వాడుకోబడి అడ్రస్ లేకుండా పోయిన వ్యక్తుల ఉదంతాలను రాస్తే వివరించినట్టుగా అవుతుంది. మరి ఇలాంటి ట్రాక్ రికార్డునుకలిగిన చంద్రబాబుకు అమరావతి ఉద్యమం ఒక లెక్కనా!
అది కూడా ఆయన అవసరం మేరకే! ఆయన అవసరం అనుకుంటే అమరావతి ఉద్యమం అవుతుంది, ఆ నిరసన పాదయాత్రగా సాగుతుంది. ఆయన అవసరం లేదు, దానితో తనకు ప్రయోజనం లేదనుకుంటే.. అది అర్థాంతరంగా అడ్రస్ లేకుండా పోతుంది!
నిన్న మొన్నటి వరకూ పచ్చ మీడియాలో, పచ్చ గుండెల్లో ప్రతిధ్వనించిన అమరావతి ఉద్యమం ఇప్పుడు అడ్రస్ లేదు! ఇది కృత్రిమ ఉద్యమం అని నిరూపించడానికి ప్రత్యర్థులు అనేక ప్రయత్నాలు చేసినా అమరావతి నిజంగానే అక్కడి రైతుల ఘోష అనేంత రేంజ్ లో టీడీపీ దాన్ని పోషించింది. పచ్చమీడియా బాకాలు ఊదింది. అయితే ఎప్పుడైతే లోకేష్ పాదయాత్రకు సమయం దగ్గరపడటం మొదలైందో, ఇప్పుడు అమరావతి పాదయాత్ర కన్నా లోకేష్ యాత్రే ముఖ్యమని చంద్రబాబు అనుకున్నారో అప్పటి నుంచినే కథ మారిపోయింది!
అమరావతి యాత్ర అటకెక్కింది! అమరావతి పేరుతో ఇక ఉద్యమం నడిపితే అటు ఉత్తరాంధ్రలోనూ, ఇటు రాయలసీమలోనూ తీవ్రమైన నష్టం జరిగేలా ఉందనే రిపోర్టులు కూడా చంద్రబాబుకు అందడంతో అమరావతి కథ కంచికి చేరడం మొదలైంది! అయితే అంతా పెయిడ్ ఉద్యమమే కాబట్టి.. ఇప్పుడు అమరావతికి చంద్రబాబు ద్రోహం చేశాడంటూ ఎవ్వరూ మీడియాకు ఎక్కరు! ఎక్కడి పెయిడ్ అర్టిస్టులు అక్కడే గప్ చుప్! అమరావతి అనేది భ్రమరావతి అని మరోసారి కూడా రుజువు అయ్యింది.
గ్రాఫిక్స్ తో దాన్నో భ్రమగా రూపించిందిన చంద్రబాబు, దానికి సంబంధించిన ఉద్యమాన్ని కూడా మిథ్యామాత్రంగా సాగించి, ఆపించారు! ఇలా కూడా అది భ్రమరావతే!