వచ్చే ఎన్నికలలో చంద్రబాబుతొ పొత్తు కావాలని వారికి ఉంది. ఆ విధంగానే బాబు వారిని తన వైపు ఇన్నాళ్ళూ తిప్పుకున్నారు. వారే సీపీఐ నేతలు. అమరావతి రాజధాని ఇష్యూ విషయంలో బాబు ఊరూరా తిరిగినపుడు ఆయన వెంట ఉన్నది సీపీఐ నాయకులే. అయితే ఇపుడు బాబు బీజేపీ వైపుగా మొగ్గు చూపుతున్నారు.
ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళి మోడీతో షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాక పొత్తు ఖాయమన్న ధీమా బాబుతో పాటు తమ్ముళ్లకూ కలిగింది. దాంతో ఇంతకాలం బాబుకు వత్తాసుగా ఉన్న సీపీఐ నాయకులకు ఇపుడు చిర్రెత్తుకుని వస్తోంది. విశాఖలో దాదాపు యాభై ఏళ్ల తరువాత సీపీఐ రాష్ట్ర మహా సభలను నిర్వహిస్తోంది. ఈ సభలలో దేశ, రాష్ట్ర రాజకీయాలను కామ్రెడ్స్ అవలోకం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే బాబు బీజేపీ బంధం మీద సెటైర్లు వేశారు. బాబు బీజేపీ వారి మోజులో పడి ఆ వైపుగా తిరుగుతున్నారని విమర్శించారు. ఇక సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ ఎంతటి బాబు ఎలా అయిపోయారు అని కాసింత సెటైరికల్ గా కామెంట్స్ చేశారు.
ఒకనాడు జాతీయ నాయకుడిగా వెలిగిన బాబు, రాజకీయాలను శాసించిన బాబు ఇపుడు ఉనికి కొరకు పోరాటం చేస్తున్నారని, బీజేపీ వెంట పడుతున్నారని మండిపడ్డారు. మొత్తానికి బాబుని ఈ ఇద్దరు ఎర్రన్నలు ఏకేసిన తీరు చూస్తే వారికి ఆయన తాజా రాజకీయ పోకడల మీద ఎంత ఆవేశం, ఆక్రోశం ఉందో అర్ధమవుతాయి.
బీజేపీ బాబు బంధం కలిసింది అంటే కామ్రేడ్స్ వేరే దారి చూసుకోక తప్పదు ఎందుకంటే కమలంతో వారిది ఆజన్మ శత్రుత్వం. ఆ విధంగా బీజేపీ మీద కోపం కూడా బాబు మీదనే చూపిస్తున్నారు అని అంటున్నారు.