తెలంగాణలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిత్యం వార్తల్లో ఉంటారు. ఈయన బీజేపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ గుర్తింపు పొందారు.
ఈయన వ్యవహార శైలి విచిత్రంగా వుంటుంది. మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేస్తూ ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తుంటారు. ఇటీవల అమరనాథ్ యాత్రకు వెళ్లి వరద ముప్పు నుంచి తృటిలో తప్పించుకుని వచ్చారు. తనకు ప్రాణహాని తప్పిందని ఆయనే స్వయంగా చెప్పారు.
తాజాగా ఆయన మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనకు ప్రాణహాని వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి వుందన్నారు. తనను వారు కాల్చేస్తారేమోననే భయాందోళనను బయట పెట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్కి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని రాజాసింగ్ చెప్పడం లేదు.
ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని చెప్పడం చర్చకు దారి తీసింది. ఉత్తరప్రదేశ్లో ఒక మతానికి చెందిన వారిపై బుల్డోజర్లు వెళ్తాయని రాజాసింగ్ కొన్ని నెలల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్లో మాదిరిగానే తెలంగాణలో కూడా బుల్డోజర్లు దిగుతాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ముస్లింలపై తరచూ అవాకులు చెవాకులు రాజాసింగ్ పేలుతుంటారు. బహుశా ఈ కారణం వల్లే తనను టెర్రరిస్టులు ఏమైనా చేస్తారన్న భయం ఆయన్ను వెంటాడుతున్నట్టుంది. ఏది ఏమైనా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆయనకే మంచిది.