తిరుమ‌ల దేవుడితో పాటు ఎన్నెన్ని అద్భుతాలో!

తిరుమ‌ల అనగానే శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడు కొలువైన క్షేత్రం అని చాలా మంది అనుకుంటారు. శేషాచ‌లం కొండ‌లు అద్భుత‌మైన తీర్థాల‌తో విరాజిల్లుతోంద‌ని ఎంతమందికి తెలుసు!?  ఓ ప్ర‌కృతి  ప్రియుడు ఆ అద్భుత‌మైన తీర్థాలను అక్ష‌రీక‌రించారు.  పాతిక సంవ‌త్స‌రాలుగా…

తిరుమ‌ల అనగానే శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడు కొలువైన క్షేత్రం అని చాలా మంది అనుకుంటారు. శేషాచ‌లం కొండ‌లు అద్భుత‌మైన తీర్థాల‌తో విరాజిల్లుతోంద‌ని ఎంతమందికి తెలుసు!?  ఓ ప్ర‌కృతి  ప్రియుడు ఆ అద్భుత‌మైన తీర్థాలను అక్ష‌రీక‌రించారు.  పాతిక సంవ‌త్స‌రాలుగా శేషాచ‌లం కొండ‌ల్లో సంచ‌రిస్తూ, తీర్థాల‌ను సంద‌ర్శిస్తూ, ఆ ప్ర‌కృతి సౌంద‌ర్యానికి అక్ష‌ర రూపం ఇచ్చారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు రాఘ‌వ‌శ‌ర్మ శేషాచ‌లం కొండ‌ల్లో నెల‌కొన్న తీర్థాల‌తో పాటు చంద్ర‌గిరి దుర్గం, దేశంలో తొలి శైవ‌క్షేత్రం గుడిమ‌ల్లం, న‌ల్ల‌మ‌లలోని బిలం గుహ, లంక‌మ‌ల కొండ‌ల‌లోని ప‌స‌ల‌గుండం క‌థ‌నాల‌ను కూడా ఆవిష్క‌రించారు. ఈ పుస్త‌కానికి 'తిరుమ‌ల దృశ్య కావ్యం' చ‌క్క‌గా పేరు పెట్టారు.

“ఒక లోతైన నీటి గుండం. కొండ కౌగిట బందీ అయిన‌ట్టు దాని చుట్టూ, పైనా క‌ప్పేసిన రాతి అంచులు. ఆ నీటి గుండం అంచులో స‌హ‌జ సిద్ధంగా ఏర్ప‌డిన పెద్ద ద్వారం. దానికి ఎదురుగా ఆవ‌లి వైపు గుండానికి న‌డినెత్తిన చీన్న చీలిక‌. ఆ చీలిక‌లోంచి నిరంత‌రాయంగా జాలువారుతున్న జ‌ల‌ధార‌. మండు వేస‌విలో కూడా గుండం నుంచి పొంగిపొర్లుతున్న స్వ‌చ్ఛ‌మైన నీళ్లు… ఆదిశేషుని ప‌డ‌గ‌ ఆకారంలో ఉన్న ఆ నీటి గుండ‌మే తిరుమ‌ల కొండ‌ల్లోని శేష‌తీర్థం”

ఈ వాక్యాలు చ‌దువుతుంటే శేష‌తీర్థాన్ని స్వ‌యంగా సంద‌ర్శిస్తున్న అనుభూతి క‌లుగుతుంది. అక్క‌డి నీటి గుండం, రాతి అంచులు, జాలువారుతున్న జ‌ల‌పాతం…. వావ్.. అక్క‌డే ఉన్న అనుభూతికి లోన‌వుతాం. ఇదే ఈ ర‌చ‌యిత గొప్ప‌త‌నం. ఎత్తైన కొండల్లో, వాటి పయిన ఉన్న దట్టమైన అడ‌వుల్లో ట్రెక్కింగ్ చేయ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. కానీ ఈ పుస్త‌కం చ‌దువుతుంటే మ‌న‌మూ ట్రెక్కింగ్ చేస్తున్న ఫీల్ క‌లుగుతుందే త‌ప్ప‌, ఏ మాత్రం అల‌స‌ట క‌ల‌గ‌దు. ఉచ్ఛ్వాస‌, నిశ్వాసాల ఎగ‌బోతలుండ‌వు.

“ఎడ‌మ వైపు కొండ ఎక్క‌డం మొద‌లు పెట్టాం. చెట్ల మ‌ధ్య‌లో ఏట‌వాలుగా ఎక్కుతున్నాం. ఒక్కో ద‌గ్గ‌ర‌గా నిటారుగా ఎక్కాలి. వెన‌క్కి తిరిగి చూస్తే, ఈ కొండ‌లో ఇంత దూరం ఎలా న‌డిచి వ‌చ్చామన్న ఆశ్చ‌ర్యం. కొండ‌ కొస‌కు చేరాం. కుడివైపున గుంజ‌న లోయ‌లోకి దిగాలి. అతిక‌ష్టంపైన అడుగులు ప‌డుతున్నాయి. రాళ్లు, ర‌ప్ప‌లు, చెట్ల కొమ్మ‌లు ప‌ట్టుకుని ఒక‌రి వెనుక ఒక‌రు దిగుతున్నాం. ప‌ట్టు దొర‌క‌న‌ప్పుడు కూర్చుని పాకుతున్నాం. మ‌రికొన్ని చోట్ల దేకుతున్నాం. కొండ అంచులో ఒక రాయి కింద వెల్ల‌కిలా ప‌డుకుని జారుతూ సాగాం. త‌లెత్తితే రాయి త‌గులుతుంది. అదిగో గుంజ‌న జ‌ల‌పాతపు హోరు”

చ‌దువుతున్నంత సేపూ కొండ ఎక్కుతూ వుంటాం. ర‌చ‌యిత వ‌ర్ణించిన ప్ర‌కారం మ‌నం కూడా ఆ అనుభూతికి లోన‌వుతాం. ఆ ద‌ట్ట‌మైన అడవిలో మ‌న అడుగులు కూడా క‌ష్టంగా ముందుకు ప‌డ‌తాయి. రాళ్లు, ర‌ప్ప‌లు, చెట్ల కొమ్మలు ప‌ట్టుకుని ఎలాగోలా  జ‌ల‌పాతానికి చేరుకుంటాం. మన‌సు హాయిగా ఊపిరిపీల్చుకుంటుంది. రాఘ‌వ‌శ‌ర్మ త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి, పాఠ‌కుడిని కూడా ట్రెక్క‌ర్ చేస్తాడ‌ని అంటే అతిశ‌యోక్తి కాదు.

రాఘ‌వ‌శ‌ర్మ 25 ఏళ్లుగా శేషాచ‌లం కొండ‌ల్లో తీర్థాల‌ను సంద‌ర్శిస్తున్నారు. ఆ కొండల్లోని అద్భుత సౌంద‌ర్యాన్ని క‌నులారా చూసిన అదృష్ట‌వంతుడు. ప్ర‌కృతిలో మ‌మేక‌మై, ఆ సౌంద‌ర్యానికి ప‌ర‌వ‌శుడై, ఆ అనుభూతిని, అనుభ‌వాల‌ను త‌న మ‌న‌సులో దాచుకోవాల‌ని అనుకోలేదు. వాటికి అక్ష‌ర రూపం ఇచ్చి, శేషాచ‌లం కొండ‌ల విశిష్ట‌త‌ను చాటి చెప్పాల‌ని ముందుకొచ్చారు. పుస్త‌కం తెర‌వ‌గానే… మిమ్మ‌ల్ని శేషాచ‌లం కొండ‌ల సౌంద‌ర్య వ‌ర్ణ‌న ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొత్త ప్ర‌పంచంలోకి మిమ్మిల్ని లాక్కెళుతుంది.

“గ‌ల‌గ‌లాపారే సెల ఏర్లు, జ‌ల‌జ‌లా దూకే జ‌ల‌పాతాలు. ప‌క్షుల ప‌ల‌క‌రింపులు, అక్క‌డ‌క్క‌డా నీటి త‌టాకాలు, అడ‌వి జంతువులు స్వేచ్ఛా విహారాలు, ద‌ట్ట‌మైన అడ‌విలో ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకుని , తూర్పు క‌నుమ‌ల్లో భాగంగా అల‌రారుతున్న శేషాచ‌లం కొండ‌లు. “ప‌దివేల శేషుల ప‌డ‌గ‌ల‌మ‌య‌మో” అన్న అన్న‌మ‌య్య భావుక‌త‌కు వాస్త‌వ రూపాలే తిరుమ‌ల తీర్థాలు” అంటూ  మ‌న‌ల్ని ట్రెక్కింగ్‌కు సిద్ధం చేస్తారాయ‌న‌.

అలా మొద‌లు పెట్టి… తాంత్రిక‌లోయ‌, శిలాతోర‌ణం, రామ‌కృష్ణ‌తీర్థం, తుంబురు తీర్థం, కుమార‌ధార‌, చ‌క్ర‌తీర్థం, శేష‌తీర్థం, యుద్ధ‌గ‌ళ‌, గుంజ‌న జ‌ల‌పాతం, నారాయ‌ణ‌తీర్థం, మా  మార్కండేయ తీర్థం … త‌దిత‌ర తీర్థాల‌ను మ‌నో నేత్రంతో ద‌ర్శ‌నం చేయిస్తారు. పౌర్ణ‌మినాటి రాత్రి  వెన్నెల్లో శేషాచ‌లం కొండల్లో  గ‌డిపితే ఎంత అద్భుతంగా వుంటుందో ఈ అక్ష‌ర శిల్పి అనుభవంలోకి తెస్తారు. అడ‌విలో స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ, వెన్నెల్లో వ‌న‌భోజ‌నాలు చేస్తే ఎంత మ‌ధురానుభూతి క‌లుగుతుందో చెబుతారు. ఇలా ఒక‌టా, రెండా… ఎన్నెన్ని అనుభ‌వాలో, అనుభూతులో!

రాఘ‌వ‌శ‌ర్మ మాట‌ల్లో చెప్పాలంటే ఒక్కో తీర్థం ఒక్కో భౌగోళిక మ‌హాద్భుతం. అలాగే ఆ అద్భుతాల‌ను అంతే గొప్ప‌గా  క‌ళ్ల‌కు క‌ట్టేలా రాశారు. ఈ క‌థ‌నాలు వేటిక‌వే ప్ర‌త్యేకం. తీర్థాలు, అడ‌వి కామ‌న్ విష‌యాలే అయినా… ఒక్కోదాని ప్రాశ‌స్థ్యాన్ని ఆయ‌న వివ‌రించిన తీరు క‌ట్టిప‌డేస్తుంది. తీర్థాలంత అంద‌గా ఈ క‌థ‌నాలున్నాయి. ఈ పుస్త‌కం చ‌దివితే… కేవ‌లం శ్రీ‌వారి ద‌ర్శ‌నానికే ప‌రిమితం కాకుండా త‌ప్ప‌కుండా మనం  కూడా తీర్థాల‌ను సంద‌ర్శించేలా ప్లాన్ చేసుకుంటామ్. ఈ పుస్త‌కం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. అలాగే పుస్త‌కం కోసం 9494517254 సెల్ నంబ‌ర్‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు.

సొదుం ర‌మ‌ణ‌