టీటీడీ అంటే… తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల, తిరుపతిని వేరు చూసి చూడలేం. కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోడానికి వెళ్తున్నాం అని చెప్పడానికి తిరుపతి ప్రస్తావించకుండా వుంటామా? తిరుపతి, తిరుమల అనేవి ప్రాంతాల పేర్లు మాత్రమే కావు. అవి రెండూ శ్రీవారికి రెండు కళ్లు లాంటివి. తిరుపతిలో కాలు మోపిన మొదలు ఆధ్మాత్మిక భావన మన మనసుల్ని సమ్మోహనం చేస్తుంది. ఓంకార నాదం మన హృదయాల్ని తన్మయత్వంలో ఓలలాడిస్తుంది.
తిరుపతిలో కొలువైన ప్రతిదీ ఏడుకొండలపై సేదతీరుతున్న శ్రీవేంకటేశ్వరుడి ప్రతీకగా భావించాల్సి వుంటుంది. తిరుమల ఏడు కొండలపై శ్రీవారు కొలువుదీరగా, ఆయన పాదాల చెంత పద్మావతి అమ్మవారు, గోవిందరాజస్వామి, కపిలేశ్వరుడు తదితర దేవతలంతా మనకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇటీవల శ్రీవారి మాతృమూర్తి వకుళామాత ఆలయం తిరుపతి-బెంగళూరు హైవేలో దినదినాభివృద్ధి చెందుతోంది.
తిరుపతి, తిరుమల అభివృద్ధిని వేరు చేసి చూడడం అంటే, తల్లి- కుమారుడిని, భార్యాభర్తల్ని విడిగా చూడడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా ఎందుకంటే టీటీడీ నిధులతో తిరుపతిని అభివృద్ధి చేయడం ఏంటనే ప్రశ్న కొందరి నుంచి వస్తున్న నేపథ్యంలో ప్రజాస్వామిక వాదుల నుంచి నిరసన వెల్లువెత్తుతోంది. తిరుపతి అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారికి ఎల్లో మీడియా తోడు కావడం విచారకరం. తమకు రాజకీయంగా గిట్టని పాలకుడు వైఎస్ జగన్ ఉండడం వల్లే కొందరు తిరుపతి అభివృద్ధికి సైంధవుల్లా అడ్డుపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో మంగళవారం టీటీడీ పాలక మండలి మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో రూ.200 కోట్లకు పైగా పనులు టీటీడీ బడ్జెట్ నుంచి చేపట్టేందుకు ఆమోద ముద్ర వేశారు. తిరుపతిలో ఎలాంటి అభివృద్ధి చేసినా, అంతిమంగా భక్తుల ప్రయోజనాలే ముడిపడి వుంటాయి. తిరుపతి అభివృద్ధికి రాజకీయాలు ముడిపెట్టడం అంటే అత్యంత దిగజారుడుతనమే. తమ రాజకీయ స్వార్థానికి దేవున్ని కూడా లాగుతున్నామనే కీలక విషయాన్ని గుర్తెరగాలి.
నిన్నటి బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో వ్యతిరేకించాల్సిందేమిటో అర్థం కావడం లేదు. తిరుచానూరులో కొలువైన శ్రీవారి పత్ని పద్మావతి అమ్మవారి చెంతకు చేరుకునేందుకు రేణిగుంటరోడ్డలోని నారాయణాద్రి కూడలి నుంచి రోడ్డును నాలుగ వరుసలతో 150 అడుగుల బైపాస్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. దీని వల్ల యాత్రికులకు ఎంతో సౌకర్యం కలగనుంది.