చినబాబు చుట్టూతా ట్రాఫిక్ జామ్!

నారావారి చినబాబు లోకేష్ చుట్టూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. నామినేటెడ్ పదవుల పందేరం దాదాపుగా ఒక కొలిక్కి వస్తుండడం.. మరో 25 రోజుల వ్యవధిలోగా నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

నారావారి చినబాబు లోకేష్ చుట్టూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. నామినేటెడ్ పదవుల పందేరం దాదాపుగా ఒక కొలిక్కి వస్తుండడం.. మరో 25 రోజుల వ్యవధిలోగా నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో.. పదవుల కోసం ఆశ పడుతున్న వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి.. కనీసం ఒక్కసారైనా నారా లోకేష్ దృష్టిలో పడి తీరాలని ప్రయత్నిస్తున్నారు.

కీలకమైన కొన్ని పదవులకు సంబంధించిన నిర్ణయాలు మాత్రం పూర్తిగా చంద్రబాబు చేతుల్లోనే ఉండగా.. అనేక పదవుల కోసం నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య పెరుగుతుంది.

నామినేటెడ్ పదవుల గురించిన కసరత్తు ఈసారి కొంచెం క్లిష్టమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న పదవులను కూటమి ప్రభుత్వం లోని మూడు పార్టీల మధ్య పంచవలసి ఉంది. ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే సీట్లు పంచుకున్నామో.. అదేవిధంగా నామినేటెడ్ పదవులు పంపకం కూడా ప్రశాంతంగా సాగిపోతుందని చంద్రబాబు నాయుడు అంటున్నారు. తద్వారా అదే వాటాల ప్రకారం నామినేటెడ్ పదవుల కేటాయింపు ఉంటుందనేది ఆయన సంకేతం ఇస్తున్నారు.

సాధారణంగా ఒక్కో సంస్థకు నామినేటెడ్ పదవుల నియామకాలు జరిగేటప్పుడు కుల ప్రాంత సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. జనసేన, బిజెపి వారి నుంచి కూడా జాబితాలు అందుతున్న సమయంలో .. ఆ పార్టీలు సూచించిన కులాలకే చెందినవారు తెలుగుదేశం పార్టీలో కూడా ఉంటే వారి అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుకనే మిత్రపక్షాలను ఒక్కో పదవికి రెండేసి పేర్లతో ప్రాబబుల్స్ ను ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో పదవుల కోసం చంద్రబాబు నాయుడును ఆశ్రయించి విన్నవించుకునే వెసులుబాటు అందరికీ దొరకదు గనుక వారంతా లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు. ఆయనతో నేరుగా యాక్సిస్ ఉన్నవారు కొందరైతే.. తమ తమ స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల సిఫారసు ఉత్తరాలు పట్టుకుని.. లోకేష్ ను కలుస్తున్న వారు కొందరు.

పెద్ద సంఖ్యలో తన వద్దకు వస్తున్న వారికి ఒక్కటి రెండు నిమిషాలు కూడా కేటాయించలేని పరిస్థితిలో లోకేష్ ఉన్నట్లుగా అమరావతి వర్గాలు చెబుతున్నాయి. మరి పార్టీలో ఎలాంటి కొత్త అసంతృప్తులు పుట్టకుండా నామినేటెడ్ పదవుల పందేరాన్ని చంద్రబాబు నాయుడు ఎలా పూర్తి చేస్తారో వేచి చూడాలి.

8 Replies to “చినబాబు చుట్టూతా ట్రాఫిక్ జామ్!”

  1. పాపం … ప్రజల నుండి ఎన్నిక కాకుండా…. నామినేషన్ అనే పద్దతి గల అడ్డదారులలో… ప్రజల సొమ్ము దర్జాగా భోంచెయ్యటానికి పైరవీలుచేసుకుంటున్నారు..!

Comments are closed.