టీటీడీ కీల‌క నిర్ణ‌యాలు!

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్‌లో టీటీడీ పాల‌క మండలి స‌మావేశం చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో సోమ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టీటీడీ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. తిరుమ‌లతో స‌మానంగా తిరుప‌తిని కూడా ప‌రిశుభ్రంగా…

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్‌లో టీటీడీ పాల‌క మండలి స‌మావేశం చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో సోమ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టీటీడీ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. తిరుమ‌లతో స‌మానంగా తిరుప‌తిని కూడా ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని టీటీడీ నిర్ణ‌యించ‌డం విశేషం. పాల‌క మండ‌లి నిర్ణ‌యాల‌ను టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి వెల్ల‌డించారు.

ప్ర‌ధానంగా తిరుపతిలో టీటీడీ ఆలయాలు, అథితి గృహాలు, సత్రాలు, భక్తులు సంచరించే ప్రాంతాల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ఆ బాధ్య‌త‌ల్ని టీటీడీ తీసుకోనుంది. ఈ నిర్ణ‌యంతో ప‌రిశుభ్ర‌మైన తిరుప‌తిని భ‌విష్య‌త్‌లో చూసే అవ‌కాశం ఉంది. ఇంకా అలిపిరి వద్ద  గోమందిరంలో ప్రతి రోజూ  శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు రుసుం ఎంత అనేది త్వ‌ర‌లో నిర్ణ‌యిస్తామ‌ని భూమ‌న వెల్ల‌డించారు.  

తిరుమ‌ల‌ను ప‌రిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికుల‌పై టీటీడీ ద‌య‌చూపింది. టీటీడీ పారిశుధ్య కార్మికుల జీతాల‌ను రూ.12 వేల నుంచి రూ.17 వేల‌కు పెంచాల‌ని నిర్ణ‌యించారు. దీంతో 5 వేల మంది పారిశుధ్య కార్మికులు లబ్ధి పొంద‌నున్నారు. అలాగే టీటీడీ  పరిధిలోని కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న‌ ఉద్యోగుల జీతాలను ప్రతి ఏడాది 3 శాతం పెంచుతూ తీర్మానించారు.

కార్పొరేషన్లో పని చేసే ఉద్యోగులు ఆక‌స్మిక మ‌ర‌ణం చెందితే వారి కుటుంబానికి రూ.2 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియాను టీటీడీ చెల్లిస్తుంది. కార్పొరేష‌న్ ఉద్యోగుల్లో ఈఎస్ఐ వ‌ర్తించ‌ని వారికి హెల్త్ స్కీమ్ వ‌ర్తింపు చేస్తారు. అలాగే టీటీడీ కళ్యాణ మండపాలలో వివాహాల సందర్భంగా డిజేలకు బదులు లలితా గీతాలు పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు.

టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ పాలకమండలి తీర్మానం చేసింది. ఇవే కాకుండా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు నిధులు కేటాయిస్తూ టీటీడీ ఆమోదం తెలిపింది. ఈ స‌మావేశంలో కార్పొరేష‌న్ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.