తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని బలి తీసుకున్న చిరుతపులి బోనులో పడిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మేటర్ అది కాదు. చిరుత కదలికలను గుర్తించి, దాన్ని బోనులో బంధించేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు.. మరో 3 చిరుతలు కూడా అదే ప్రాంతంలో సంచరిస్తున్న విషయాన్ని కనుగొన్నారు. దీంతో కాలినడక భక్తులు బిక్కుబిక్కుమంటున్నారు.
చిన్నారి మృతికి కారణం చిరుతపులా లేక ఎలుగుబంటా అనే అనుమానాలు ఉండేవి మొన్నటివరకు. అయితే అది చిరుత దాడి అని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పట్టుబడిన చిరుత పాదముద్రలు కాకుండా, మరికొన్ని చిరుతల పాదముద్రల్ని కూడా గుర్తించి షాక్ అయ్యారు.
చిరుత దాడితో అత్యున్నత సమావేశం నిర్వహించిన టీటీడీ, ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించింది. నడకదారిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నారులతో ఉన్న భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నారు. 2 గంటల లోపు కూడా నడకదారిలో వచ్చే చిన్నారులకు పూర్తి వివరాలతో ట్యాగులు తగిలిస్తున్నారు. తిరిగి మళ్లీ ఉదయం 5 గంటల నుంచి చిన్నారులతో ఉన్న భక్తులకు అనుమతి ఇస్తున్నారు.
ఇలాంటి నిబంధనల్నే ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలకు కూడా విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు.
అదిగో జింక.. ఇదిగో పులి..
ఇదిలా ఉండగా.. చిరుత దాడి, మరో 3 చిరుతలు సంచరిస్తున్నాయనే సమచారంతో నడకదారి మార్గంలో పుకార్లు చెలరేగుతున్నాయి. ఈరోజు ఉదయం కొంతమంది భక్తులు, మెట్లమార్గానికి దగ్గర్లో చిరుత ఉందంటూ హాహాకారాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, ఆ ప్రాంతంలో తనిఖీ చేశారు. ఎలాంటి పులి ఆనవాళ్లు కనిపించలేదు. అంతేకాదు, ఆ ప్రాంతంలో జింకలు సంచరిస్తున్నట్టు కనుగొన్నారు. కొంతమంది భక్తులు, జింకను చూసి చిరుతపులి అని భ్రమపడ్డారని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
తాజాగా జరిగిన ఘటనలన్నింటిపై సమీక్ష నిర్వహించింది టీటీడీ పాలకమండలి. సాయంత్రం 6 గంటల తర్వాత నడకమార్గాన్ని పూర్తిగా మూసేసే ప్రతిపాదన కూడా పాలకమండలి ముందుకొచ్చింది. మరోవైపు బోనులో పట్టుబడిన చిరుత తలకు గాయాలు కావడంతో, జూపార్క్ లో దానికి చికిత్స అందిస్తున్నారు.