మాన‌వ మృగాల ఆట క‌ట్టించే సాధ‌నాలేవీ?

కాదేదీ రాజ‌కీయానికి అన‌ర్హ‌మ‌ని కొంద‌రి చేష్ట‌లు చెబుతున్నాయి. తిరుమ‌ల‌కు వెళ్లే న‌డ‌క‌దారుల్లో చిరుత‌ల‌తో పాటు ఇత‌ర వ‌న్య మృగాల సంచారం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిజానికి అవి సంచ‌రిస్తున్న ప్రాంతానికే మ‌నుషులు వెళుతున్నారు. అయితే క‌లియుగ…

కాదేదీ రాజ‌కీయానికి అన‌ర్హ‌మ‌ని కొంద‌రి చేష్ట‌లు చెబుతున్నాయి. తిరుమ‌ల‌కు వెళ్లే న‌డ‌క‌దారుల్లో చిరుత‌ల‌తో పాటు ఇత‌ర వ‌న్య మృగాల సంచారం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిజానికి అవి సంచ‌రిస్తున్న ప్రాంతానికే మ‌నుషులు వెళుతున్నారు. అయితే క‌లియుగ దైవం కొలువైన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిపై భారాన్ని వేసి, మృగాల‌కు భ‌య‌ప‌డ‌కుండా భ‌క్తులు ఎప్ప‌టి నుంచో వెళుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల కాలంలో చిన్నారుల‌పై క్రూర జంతువుల దాడి భ‌క్తుల‌తో పాటు స‌మాజాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ నేప‌థ్యంలో భ‌క్తుల భ‌ద్ర‌తే ప్ర‌థ‌మ ల‌క్ష్యంగా భావించిన టీటీడీ నూత‌న చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. న‌డ‌క మార్గంలో వెళ్లే భ‌క్తుల భ‌ద్ర‌త కోసం ఒక క‌ర్ర‌ను ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అలాగే న‌డ‌క మార్గంలో నిర్దేశిత స‌మ‌యం లోపే పిల్ల‌ల రాక‌ను అనుమ‌తిస్తూ టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది.

దేవుడైనా, మ‌రెవ‌రైనా ప్రాణాల‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తార‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే భ‌క్తుల‌కు క‌ర్ర‌ల ఇవ్వ‌డాన్ని రాజ‌కీయ కోణంలో చూడ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. క‌ర్ర‌ల‌పై టీడీపీ, దాని అనుకూల మీడియా వెట‌కారం  భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మే అని అంటున్నారు. క‌ర్ర‌లు ఇవ్వ‌డం త‌ప్ప‌ని మాట్లాడేవాళ్లు, ఒప్పు ఏంటో వెల్ల‌డిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అలా కాకుండా క‌ర్ర‌ల‌కు రాజ‌కీయాన్ని అంట‌క‌ట్టి ఇష్ట‌మొచ్చిన‌ట్టు అవాకులు చెవాకులు పేలుతున్నారు. కొంద‌రు గొడ్డ‌లు, తుపాకులు ఇవ్వాల‌ని వెట‌క‌రిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తుంటే మ‌నుషుల్లో ఇంత దారుణంగా క్రూర‌త్వం పెరిగిందా అనే ఆలోచ‌న ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన హిందూ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని కూడా ఈ మాన‌వ మృగాలు రాజ‌కీయం కోసం వాడుకుంటున్నాయా? అని విజ్ఞులు వాపోతున్న ప‌రిస్థితి.

రాజ‌కీయాల కోసం స‌వాల‌క్ష వేదిక‌లున్నాయి. వాటిని వాడుకోవ‌చ్చు. కానీ న‌డ‌క దారుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు త‌దిత‌ర వ‌న్య ప్రాణుల సంచారం భ‌యాందోళ‌న క‌లిగిస్తున్న ప‌రిస్థితిలో, భ‌క్తుల్లో భ‌రోసా క‌లిగించే ప‌నుల‌కు స్వ‌స్తి చెప్పి, వెట‌కారం చేయ‌డం కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న‌ల్లో ప‌శుత్వాన్ని బ‌య‌ట‌పెడుతోంది. న‌డ‌క దారుల్లోకి భ‌క్తుల‌కు క‌ర్ర‌లు ఇవ్వడంపై రాజ‌కీయం చేయ‌డం కంటే నీచ‌మైంది లేదు. 

ఏదో ఒక ధైర్యాన్ని క‌ల్పించే ప్ర‌య‌త్నాల‌కు ఆటంకాలు క‌లిగించే దుశ్చ‌ర్య‌ల‌కు స్వ‌స్తి చెప్పాలి. కొంద‌రి శాడిజాన్ని చూస్తుంటే… మాన‌వ మృగాల ఆట క‌ట్టించేందుకు సాధ‌నాలేంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.