ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి నుంచి ఎంపీగా బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయన మీద వైసీపీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడిని పోటీకి దించింది. బూడికి ప్రత్యక్ష ఎన్నికల్లో అనుభవం ఉంది. ఆయన ఇప్పటిదాకా ఎక్కడా ఓటమి చెందలేదు. పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు.
ఆయన పట్ల ప్రజలలో మంచి ఆదరణ కూడా ఉంది. సీఎం రమేష్ అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పారాచూట్ నేత అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలింగ్ ముగిసాక తాను మంచి మెజారిటీతో గెలుస్తున్నట్లుగా సీఎం రమేష్ మీడియాకు చెప్పారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని కూడా ఆయన జోస్యం చెప్పారు.
సీఎం రమేష్ విశాఖ అనకాపల్లి టీడీపీ రాజకీయాన్ని సెట్ చేయడంతో తనదైన రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శించారు. ఉద్ధండులు లాంటి మాజీ మంత్రులు సీనియర్ నేతలను కలిపారు. అలా ఒక్క త్రాటి మీద టీడీపీని జనసేనను బీజేపీని తీసుకుని రావడం ద్వారా సీఎం రమేష్ తొలి విజయం అందుకున్నారు.
ఆయన బీజేపీలో ఉన్నా టీడీపీ అధినాయకత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల టీడీపీని సైతం పూర్తిగా నడిపించారు అని అంటున్నారు. సీఎం రమేష్ అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిస్తే మాత్రం ఆయన రాజకీయం మొదలవుతుందని అంటున్నారు.
ఆయన కూటమితో పాటు టీడీపీ రాజకీయాన్ని శాసిస్తారు అని అంటున్నారు. ఆయనకు ఉన్న అంగబలం అర్ధబలంతో విశాఖతో పాటు ఉత్తరాంధ్రా రాజకీయం మీద ప్రభావం చూపిస్తారు అని అంటున్నారు. ఇది టీడీపీ నేతలలో ఒకింత గుబులు రేపుతోంది అని అంటున్నారు.
గతంలో విశాఖకు వలస వచ్చిన బడా నేతలు అనంతర కాలంలో పదవులు అందుకుని ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించారు అని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఎన్నికల సభలలో సీఎం రమేష్ ని పొగడడం బాబుని రమేష్ పొగడడం తో ఆయన రాజకీయం ఉత్తరాంధ్రలో మొదలవుతుందా అన్నదే పసుపు శిబిరంతో పాటు విశాఖ రాజకీయాల్లో కూడా జోరుగా చర్చ సాగుతోంది.