తెలుగుదేశం 34 మందితో రెండో జాబితా విడుదలైంది. కడప జిల్లా వరకూ అభ్యర్థుల ఎంపిక ప్రశంసలు అందుకుంటోంది. కడప జిల్లాలో కమలాపురం, ప్రొద్దుటూరు అభ్యర్థులుగా పుత్తా చైతన్యరెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డికి బదులుగా ఆయన తనయుడు చైతన్యను బరిలో నిలిపారు. ఇక ప్రొద్దుటూరు విషయానికి వెళితే, టీకెట్ కోసం తీవ్రమైన పోటీ వుంది.
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీ.ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి, రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీవ్రంగా పోటీ పడ్డారు. వీళ్లంతా టికెట్ తమకంటే తమకని ప్రచారం చేసుకుంటున్నారు. వేర్వేరుగా టీడీపీని గెలిపించాలంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఒకరంటే మరొకరికి అసలు పొసగని పరిస్థితి.
ఈ నేపథ్యంలో వరదరాజులరెడ్డికి టికెట్‌ను చంద్రబాబు ఖరారు చేయడం విశేషం. ప్రొద్దుటూరు సిటింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇప్పటికే ప్రచారంలో దూసుకెళుతున్నారు. వరదరాజులరెడ్డికి రాజకీయంగా రాచమల్లు శిష్యుడే. వరదరాజులరెడ్డి దగ్గర రాచమల్లు ఓనమాలు నేర్చుకున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా శివప్రసాద్‌రెడ్డిని చేసింది వరదరాజులరెడ్డే. అనంతర కాలంలో రాజకీయంగా వరదతో రాచమల్లు విభేదించారు.
వైఎస్సార్ మరణానంతరం వైసీపీ ఆవిర్భవించడం, వైఎస్ జగన్‌ను నమ్మకస్తుడైన నాయకుడిగా శివప్రసాద్‌రెడ్డి కొనసాగుతున్నారు. అందుకే రాచమల్లుకు రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. మూడోసారి కూడా రాచమల్లు బరిలో ఉండనున్నారు. దాదాపు 83 ఏళ్లున్న వరదరాజులరెడ్డిని చంద్రబాబు ఎంచుకోవడం చర్చనీయాంశమైంది.