పదవుల కోసం ఏ గడ్డి తినడానికైనా వెనుకాడని నాయకుల్ని చూస్తున్నాం. తమకు పదవి ఇచ్చిన నాయకుడి రాజకీయ అవసరాల కోసం త్యాగం చేసే వారు అరుదు. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేసి, ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయడానికి ముందుకు రావడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా వాసిరెడ్డి పద్మ గుర్తింపు పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి ఇచ్చి సీఎం జగన్ తన అభిమానాన్ని చాటుకున్నారు. తనకిచ్చిన పదవికి వన్నె తెచ్చేలా పద్మ వ్యవహరించారు. హుందాతనాన్ని పాటిస్తూ వచ్చారు. మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ బాధితులకు న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ గత నెల 29న రాజీనామా చేసిన సంగతి ఇప్పుడు వెలుగు చూసింది. పద్మ రాజీనామా నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే అలాంటి ప్రచారాన్ని ఆమె కొట్టి పారేశారు. రాజీనామా లేఖలో చాలా స్పష్టంగా ఎన్నికల్లో పని చేయడానికే అని ఆమె పేర్కొన్నారు.
“మహిళా సాధికారతకు అర్థం చెప్పిన మీ పాలన గురించి ప్రచారం చేయాలని, పేద ప్రజలు బాగుండాలంటే మీరు ముఖ్యమంత్రిగా కలకాలం ఉండాలని ప్రజల ముందు చెప్పాలనే సదుద్దేశంతో ఎన్నికల ముందు నూతన బాధ్యతలు స్వీకరించాలని భావిస్తూ… మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నా” అని వాసిరెడ్డి పద్మ స్పష్టంగా తెలిపారు.
ఇకపై ఆమె పార్టీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఇంత కాలం రాజ్యాంగ పదవిలో వుండడం వల్ల పద్మ పార్టీ పరంగా మాట్లాడలేకపోయారు. ఇకపై ప్రతిపక్షాల విమర్శలకు దీటైన సమాధానం ఇవ్వనున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముంగిట రాజ్యాంగ పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మను వైసీపీ శ్రేణులు అభినందిస్తున్నాయి.