విశాఖ అంటే వలస నాయకులకు అడ్డాగా మారిపోయింది. అది ఇవాళా నిన్నా కాదు, మూడు దశాబ్దాల క్రితమే విశాఖ ఎంపీ సీటు వలస నేతలు సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యే సీట్ల మీద కూడా పాగా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వలస నాయకుల మీద సంచలన కామెంట్స్ చేశారు.
విశాఖ వాసులు మంచివారు ప్రశాంతంగా ఉంటారు ఎంతమంది వలస నాయకులు వచ్చినా ఆదరిస్తూంటారు ఒక విధంగా అది కాస్తా మితిమీరి వలస నాయకులు విశాఖ నెత్తి మీదకు ఎక్కుతున్నారని మండిపడ్డారు. విశాఖవాసుల సహనం వల్లనే ఇది జరుగుతోందని ఆయన అన్నారు.
స్థానిక నాయకులు తగ్గిపోవడం వల్లనే ఇలా సాగుతోందని అన్నారు. వలస నాయకులకు ఈసారి తగిన బుద్ధిని ప్రజలు చెబుతారని ఆయన స్పష్టం చేశారు. వలస నాయకులకు చోటు లేకుండా విశాఖ గెలవాలని ఆయన అంటున్నారు. తాను విశాఖ సౌత్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో తనకే విశాఖ సౌత్ సీటు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారని, తాను మరోసారి గెలిచి జగన్ మన్ననలు అందుకుంటాను అని అన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఏపీలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని వాసుపల్లి జోస్యం చెప్పారు. తమది గెలిచే పార్టీ అని ఏపీలోనే స్ట్రాంగ్ పార్టీ అని అందువల్లనే తమ పార్టీలో కూడా సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నారు. వైఎస్ జగన్ డెసిషన్ ఎవరికైనా ఫైనల్ కావాలని వాసుపల్లి పేర్కొన్నారు.
వాసుపల్లి ఇంతకీ వలస నాయకులు అంటూ చేసిన కామెంట్స్ ఎవరి మీద అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. తన సౌత్ సీటు విషయంలో పోటీ పడుతున్న సొంత పార్టీలో వలస నాయకులు ఉన్నారా వారి మీదనే ఆయన మండిపడ్డారా లేక మూడు దశాబ్దాలుగా విశాఖలో ఉన్న వలస నాయకుల మీద ఫైర్ అయ్యారా అన్నది ఇపుడు పెద్ద ఎత్తున రాజకీయంగా నేతలను ఆలోచింపచేస్తోంది.