మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటే ఎల్లో బ్యాచ్‌కు అపారమైన గౌరవం. ఆయన్ను రాష్ట్రపతిగా బీజేపీ నాయకత్వం పంపలేదని వ్యతిరేక వార్తల్ని కూడా రాయడం చూశాం. వెంకయ్యనాయుడు అంటే బీజేపీ నేతల కంటే టీడీపీ నేతలకే ఎక్కువ గౌరవం. కారణాలేవైనా వెంకయ్య అంటే ఎల్లో టీంకు ఆరాధన. అలాంటి వెంకయ్యనాయుడు ఎల్లో బ్యాచ్‌ను వెన్నుపోటు మాటతో చావు దెబ్బతీశారు.
వెంకయ్యనాయుడి వెన్నుపోటుకు ఎల్లో మీడియాలో స్థానం దక్కలేదంటే, వారు ఎంతగా బాధ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. తామెంతో అభిమానించే వెంకయ్య వెన్నుపోటు పొడిచినంతగా గిలగిలలాడుతున్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార ప్రదాన సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్యకు చంద్రబాబు వెన్నుపోటు పొడవడాన్ని ఆయన పేరు చెప్పకుండా ప్రస్తావించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు అంటే చంద్రబాబే గుర్తుకొస్తారు.
దీంతో చంద్రబాబు వెన్నుపోటు నైజాన్ని సమాజానికి తెలియనివ్వకూడదనే ఎల్లో మీడియా తాపత్రయాన్ని గమనించొచ్చు. వెంకయ్య ప్రసంగంలోని వెన్నుపోటును ఎడిట్ చేసి మరీ ప్రచురించడం గమనార్హం. అయితే ప్రత్యామ్నాయ మీడియా యాక్టీవ్‌గా పని చేస్తున్న నేపథ్యంలో బాబు నిజస్వరూపాన్ని కళ్లకు కట్టిన వెంకయ్య ప్రసంగంలోకి కీలక అంశాలు అందరికీ తెలిశాయి.
వెంకయ్య ఏమన్నారంటే…సినిమా, రాజకీయ రంగాల్లో తనకు తాను సాటి లేదనిపించుకున్న ఎన్టీ రామారావు రాజకీయాల్లో కుళ్లు, కుతంత్రాలు గమనించలేకపోయాడని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఆయన భోళా మనిషి అన్నారు. అందుకే వెన్నుపోటుకు గురయ్యాడని వెంకయ్య అన్నారు.
ఎన్టీఆర్‌పై వెంకయ్య చేసిన కీలక వ్యాఖ్యలకు ఈనాడు పత్రిక చోటు కల్పించలేదు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే… అదొక్కటీ తప్ప అన్నట్టుగా రాసింది. సోషల్ మీడియా, టీడీపీ వ్యతిరేక మీడియా బలపడిన నేపథ్యంలో ఇంత బహిరంగంగా ఎల్లో మీడియా నిజాల్ని దాచడాన్ని గమనించొచ్చు. ఇక ఎల్లో మీడియా మాత్రమే రాజ్యమేలే రోజుల్లో ఎన్ని నిజాలకు సమాధి కట్టు వుంటుందో అర్థం చేసుకోడానికి ఇంత కంటే ఉదాహరణ ఏం కావాలి? అనే చర్చ నడుస్తోంది.